ఐపీఎల్ లీగ్ కు సర్కార్ అనుమతిచ్చేనా..?
భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో విదేశాల్లోనైనా పొట్టి క్రికెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది బీసీసీఐ. అమేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

ఐపీఎల్ అంటే అంత ఇంతా జోష్ కాదు. చిన్న పెద్ద తేడాలేకుండా మ్యాచ్ లకు అతుక్కుపోతారు. అలాంటిది, కరోనా ప్రభావంతో క్రీడా మైదానాలన్నీ బోసిపోయాయి. మ్యాచ్ అన్నదే లేక అభిమానులు చిన్నబోయారు. భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో విదేశాల్లోనైనా పొట్టి క్రికెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది బీసీసీఐ. అమేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌ను యూఏఈలోనే నిర్వహించాలనుకుంటున్నామని ఐపీఎల్ పరిపాలన మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అన్నాడు. దీంతో కరోనా వైరస్ కారణంగా టీ20 ప్రపంచకప్ రద్దు కావడంతో ఐపీఎల్‌పై తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు అధికమవ్వడంతో ఐపీఎల్ లీగ్‌ను ఇతర దేశాల్లో నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంక, న్యూజిలాండ్, యూఏఈ దేశాలు ఐపీఎల్ నిర్వహణకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అన్ని జట్లకు కావాల్సిన సదుపాయాలు దుబాయ్‌లో ఉన్నాయని అక్కడి స్పోర్ట్స్ సిటీ నిర్వహకులు ఇప్పటికే స్ఫష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపైనే ఐపీఎల్ భవిత ఆధారపడి ఉంది.
