AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయం

బిజెపి అధినాయకత్వం రాజస్థాన్లోని ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపుతున్నారని, ఇతరత్రా సాయం కూడా చేస్తామంటూ వారిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తర్వాత బిజెపి అధినాయకత్వం కన్ను...

రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయం
Rajesh Sharma
|

Updated on: Jul 11, 2020 | 4:25 PM

Share

రాజస్థాన్ రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. అశోక్ గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్తెసరు మెజారిటీతో మనుగడ సాగిస్తూ ఉండగా రాజకీయ చక్రం తిప్పేందుకు బిజెపి యథాశక్తి ప్రయత్నం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బిజెపి నేతలు గాలం వేస్తున్నారు అంటూ సాక్షాత్తు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడం రాజస్థాన్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

తమ శాసన సభ్యులకు డబ్బు ఎరవేసి లాగేందుకు బిజెపి అధినాయకత్వం ప్రయత్నం చేస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. దేశంలో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంటే ఇంకోవైపు కమలనాథులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. తన నాయకత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రయత్నాలు చేస్తుంటే కమలనాథులు మాత్రం తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని కాంగ్రెస్ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారు.

బిజెపి అధినాయకత్వం రాజస్థాన్లోని ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపుతున్నారని, ఇతరత్రా సాయం కూడా చేస్తామంటూ వారిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తర్వాత బిజెపి అధినాయకత్వం కన్ను రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పడిందని ఏఐసీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత నెలలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసిందని.. అదే విధానాన్ని రాజస్థాన్లోనూ అవలంబించాలని కమలనాథులు వ్యూహం రచించారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించేందుకు బీజేపీ నేతలు ఆసక్తి కనబరచడం లేదు. రాజకీయాల్లో ఈ రోజైనా.. ఏదైనా పరిణామం సాధ్యమేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు చేతులు మారడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాస్త అటూ ఇటుగా అయినా బీజేపీ నేతలు అక్కడి అధికార పార్టీని చీల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.