AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !

సముద్రంలో భారత నౌకాదళ శక్తిని మరింత పెంచేందుకు అత్యాధునిక మధ్యశ్రేణి సంచార ఆయుధాలను సమకూర్చుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు యుద్ధనౌకలు, రాడార్ కేంద్రాలు, తీర ప్రాంత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల ఈ మానవరహిత ఆయుధాలు ఒకేసారి పది వరకు నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

సముద్రంలో భారత్‌కు మరో శక్తివంతమైన ఆయుధం.. 100 కి.మీ దూరంలోని శత్రువు అంతం !
Medium Range Loitering Muni
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 1:01 PM

Share

సముద్రంలో శత్రు యుద్ధనౌక కనిపించిందా? ఇక భారీ క్షిపణిని ప్రయోగించాల్సిన అవసరం లేకపోవచ్చు. యుద్ధనౌక నుంచే ఒక చిన్న మానవరహిత విమానాన్ని ప్రయోగించి.. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని శత్రువు టార్గెట్ గుర్తించి, కొంతసేపు దాని చుట్టూ తిరిగి, సరైన సమయంలో నేరుగా ఢీకొట్టే టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకోబోతోంది. అవును.. భారత నేవీ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరబోతోంది. సముద్ర గర్భంలో శత్రు దేశాల ఆటకట్టించేందుకు దేశీయంగా ‘మీడియం రేంజ్ లోయిటరింగ్ మ్యూనిషన్’ (LM-MR) కొనుగోలుకు రక్షణ శాఖ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (RFI) జారీ అయింది.. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది గాల్లోకి వెళ్లిన తర్వాత వెంటనే లక్ష్యాన్ని ఢీకొట్టదు. ముందుగా ఫిక్స్ చేసిన ప్రాంతానికి చేరుకుని.. అక్కడ కొంతసేపు లక్ష్యం కోసం గాలిస్తుంది. సరైన టార్గెట్ కనిపించగానే దానిపై దాడి చేస్తుంది.

100 కిలోమీటర్ల దూరం.. లక్ష్యం మాత్రం పక్కా!

ఈ ఆయుధం ప్రధానంగా సముద్రంలోని శత్రు యుద్ధనౌకలు, తీర ప్రాంత సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు వంటి కీలక లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడనుంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంటే.. శత్రు నౌక మన యుద్ధనౌకకు చాలా దూరంలో ఉన్నా.. దాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.

పరిమాణంలో చిన్నదే.. సామర్థ్యంలో మాత్రం పెద్దదే!

ఈ మానవరహిత విమానం గరిష్ఠంగా 2.5 మీటర్ల పొడవు, దాదాపు 3 మీటర్ల రెక్కల వెడల్పు కలిగి ఉంటుంది. యుద్ధనౌకపై ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. ప్రత్యేక పెట్టెలో ఉంచి, డ్రైవింగ్‌లో సహాయపడే వ్యవస్థ సాయంతో నేరుగా నౌక నుంచే గాల్లోకి పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో నౌకకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా దీనిని వెంటనే బయటకు తొలగించే ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది.

ఒక వ్యక్తి.. ఒకేసారి 10 మానవరహిత విమానాలు!

ఈ ఆయుధంలోని మరో ప్రత్యేకత ఇది. ఒకే యాక్షన్ పాయింట్ నుంచి..  ఒక వ్యక్తి ఏకకాలంలో 10 మానవరహిత విమానాలను నిర్వహించగలిగేలా దీనిని రూపొందిస్తున్నారు. అంటే ఒకేసారి పలు లక్ష్యాలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైన సమయంలో దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించిన విమానాన్ని గాల్లో ఉండగానే మరో యుద్ధనౌక నియంత్రణకు అప్పగించవచ్చు. అంటే ఒక నౌక నుంచి బయలుదేరిన ఆయుధాన్ని.. అవసరాన్ని బట్టి మరో నౌక నుంచే నియంత్రించవచ్చు.

సంకేతాలను అడ్డుకున్నా.. లక్ష్యాన్ని వదలదు!

యుద్ధ సమయంలో శత్రువు ముందుగా చేయడానికి ప్రయత్నించేది మన సమాచార, దిశానిర్దేశ వ్యవస్థలను అడ్డుకోవడమే. అయితే ఈ ఆయుధాన్ని అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా రూపొందిస్తున్నారు. ఉపగ్రహ ఆధారిత దిశానిర్దేశ సంకేతాలు అందుబాటులో లేకపోయినా లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. ఇది నేరుగా యుద్ధనౌకలోని పోరాట నిర్వహణ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. అలాగే భారతీయ నావిగేషన్ వ్యవస్థ, దిశను గుర్తించే పరికరాలు, గాలి వేగాన్ని కొలిచే పరికరాలు వంటి వాటి సహాయంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

సముద్రంలో ఎంతటి వాతావరణమైనా ఎదుర్కొంటుంది!

సముద్రంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. భారీ గాలులు, అధిక తేమ, తీవ్ర ఉష్ణోగ్రతలు.. అన్నింటినీ తట్టుకునేలా దీనిని రూపొందిస్తున్నారు. మైనస్ 20 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో, దాదాపు 95 శాతం తేమలో, అలాగే గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే గాలుల్లోనూ నౌక డెక్ నుంచి ప్రయోగించగలిగేలా దీని రూపకల్పన చేస్తున్నారు. అంటే సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేకపోయినా.. అవసరమైన సమయంలో దాడి చేసే సామర్థ్యం ఉండనుంది.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట

ఈ ప్రాజెక్టును రక్షణ మంత్రిత్వ శాఖ భారతీయ రూపకల్పన, అభివృద్ధి, తయారీకి ప్రాధాన్యమిచ్చే కొనుగోలు విధానం కింద చేపడుతోంది. దీని రూపకల్పన భారత్‌లోనే జరగాలి. అలాగే కనీసం 50 నుంచి 60 శాతం వరకు స్వదేశీ పరికరాలను ఉపయోగించాలి. వీటి వినియోగ కాలం కనీసం 10 సంవత్సరాలు ఉండేలా చూస్తున్నారు.

తయారీ సంస్థ కేవలం మానవరహిత విమానాలను అందిస్తే సరిపోదు. వాటితో పాటు ప్రయోగించే పరికరాలు, నియంత్రణ కేంద్రాలు, సమాచార ప్రసార పరికరాలు, శిక్షణ కోసం అనుకరణ వ్యవస్థలు.. అన్నింటినీ అందించాలి. అంతేకాదు.. వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం భారత్‌లోనే సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.

భారీ క్షిపణికి చిన్న ఆయుధం ప్రత్యామ్నాయమా?

ఇదే ఈ సాంకేతికతలో అసలు స్పెషాలిటీ. ప్రతి లక్ష్యం కోసం భారీ, ఖరీదైన క్షిపణిని ప్రయోగించాల్సిన అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో పనిచేసే ఈ తరహా ఆయుధాలతో శత్రు యుద్ధనౌకలు, రాడార్ కేంద్రాలు, తీర ప్రాంత స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇతర దేశాల నౌకాదళాల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో.. భారత నౌకాదళం తన దాడి సామర్థ్యాలను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

సైజ్ చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది

దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాన్ని వెతికి పట్టుకుని దాడి చేయగల ఈ మానవరహిత ఆయుధాలు భారత నౌకాదళంలో చేరితే.. సముద్ర యుద్ధంలో భారత శక్తిని మరింత పెంచే అవకాశం ఉంది.

Follow Us