రానుంది మరింత కష్టకాలం? భయపెడుతున్న IMD తాజా రిపోర్ట్
దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోవచ్చని ఐఎమ్‌డీ హెచ్చరించింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది వ్యవసాయం, ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, నీటి వనరులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) తాజా అంచనాల ప్రకారం, జూన్-సెప్టెంబర్ మాన్‌సూన్ సీజన్‌లో దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ) వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే, గత 11 సంవత్సరాలలో నమోదయ్యే అత్యల్ప రుతుపవన వర్షపాతంగా ఇది నిలిచే అవకాశముంది. అంతకుముందు ఐఎమ్‌డీ 92 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ, తాజా సమీక్షలో దానిని మరింత తగ్గించింది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ ప్రకారం.. జూన్ నెలలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడి, రుతుపవనాల రెండో భాగంలో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి అత్యంత కీలకమైన జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నినో ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని శాస్త్రీయ అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ పరిణామాలు వ్యవసాయ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతం రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. దేశంలోని వ్యవసాయ భూమిలో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగా ఉండటంతో వర్షాల కొరత పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి, మొక్కజొన్న, వరి వంటి పంటల దిగుబడులను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రుతుపవనాల బలహీనత గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని తగ్గించడంతో పాటు ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశముంది. ఇదే సమయంలో నీటి నిల్వలు, జలాశయాలు, భూగర్భ జలాలు, జలవిద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది. మరోవైపు జూన్ నెలలో పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు వీచే అవకాశముందని కూడా హెచ్చరించింది. ప్రస్తుతం పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బలహీన రుతుపవనాలు దేశ ఆర్థిక వ్యవస్థకు మరో సవాల్‌గా మారే అవకాశముందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి నిర్వహణ, పరిరక్షణ చర్యలు, వ్యవసాయ అత్యవసర ప్రణాళికలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
