‘ఆర్‌జీయూకేటీ’ కి సవాల్‌గా మారిన.. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు..
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి, కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల వ్యవహారం ‘రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి, కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల వ్యవహారం ‘రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ)’కి పెద్ద సవాల్‌గా మారింది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దుచేసిన ప్రభుత్వం విద్యార్థులందరూ పాసైనట్లు ప్రకటించడంతో పాటు వారికి గ్రేడ్లు/మార్కులు ఇవ్వడం లేదంటూ ఉత్తర్వులివ్వడమే ఇందుకు కారణం. పదో తరగతి విద్యార్థుల మెరిట్‌ను గుర్తించి అడ్మిషన్లు చేయదలచుకున్న వారు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ సలహాను పాటించే పరిస్థితి లేదని ఆర్‌జీయూకేటీ భావిస్తోంది.
రూరల్ ఏరియా విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించడమే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు/మార్కుల ఆధారంగా చేయాలని ఆర్‌జీయూకేటీ చట్టం చెబుతోంది. అంతే తప్ప ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టేందుకు ఎలాంటి నిబంధనా లేదు. ఈ ఒక్క విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం చట్టాన్ని సవరించడం కష్టమైన పనిగా వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తే ఈ ప్రత్యేక యూనివర్సిటీ లక్ష్యమే దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.



