హాలీవుడ్ మూవీ సిరీస్ ‘ది అవెంజర్స్’కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. భారత్‍లోనూ ‘ది అవెంజర్స్’కు అభిమానులు అధికమే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. వీరంతా ప్రస్తుతం ‘ది అవెంజర్స్ – ఎండ్‌గేమ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ను అందిస్తోంది. ఈ సర్‌ప్రైజ్‌తో సినిమాపై అభిమానుల ఆసక్తి వేయిరెట్లు కానుంది. ‘ది అవెంజర్స్ – ఎండ్‌గేమ్’ కోసం సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ ఒక పాటను స్వరపరుస్తున్నారు. ఈ పాటను తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్‌లో రూపొందిస్తున్నారు. ఇది అవెంజర్స్ ఫ్యాన్స్ అందరికీ గర్వకారణం.
ఈ పాటను హైదరాబాద్‌లో ఏప్రిల్ 7 లేదా 8వ తేదీల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఎ.ఆర్.రెహమాన్ స్వయంగా ఆవిష్కరించనున్నారు. ది వాల్ట్ డిస్ని కంపెనీ స్టూడియో హెడ్ బిక్రమ్ దుగ్గల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘ది అవెంజర్స్ – ఎండ్‌గేమ్’ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.