AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనీవినీ ఎరుగని స్థాయిలో మూసీ మహోగ్రరూపం

మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. ఎన్నడూ లేనంతంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్ట్‌ చరిత్రలోనే 2 లక్షల 36 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి.

కనీవినీ ఎరుగని స్థాయిలో మూసీ మహోగ్రరూపం
Sanjay Kasula
|

Updated on: Oct 15, 2020 | 9:26 PM

Share

Musi River : మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. ఎన్నడూ లేనంతంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్ట్‌ చరిత్రలోనే 2 లక్షల 36 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇళ్లు, భారీ వాహనాలు, కార్లు, బైకులు ట్రాన్స్‌ఫార్మర్లు పెద్ద సంఖ్యలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పరివాహక ప్రాంత ప్రజలకు కన్నీటిని మిగిల్చింది మూసీ.

1963లో మూసీపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు..1983లో అత్యధికంగా 2లక్షల 26వేల క్యూసెక్కుల వరద వచ్చింది. గతేడాది 40వేల క్యూసెక్కుల వరద వస్తేనే గేట్ల నిర్వహణలో చాలా ఇబ్బందులొచ్చాయి. కానీ ఈ ఏడాది 2లక్షల 36వేల క్యూసెక్కుల వరదనీరు పోటెత్తింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల కురిసిన భారీ వర్షాలు, ఆలేరు వాగుకొచ్చిన వరదతో మూసీ ఉప్పొంగింది. దీనికితోడు హిమాయత్‌సాగర్‌ జలాశయం 13 గేట్లను ఎత్తడంతో భారీగా వరద వచ్చి చేరింది. 4.46 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా..647అడుగుల వరకు నీటిని నిల్వ చేశారు.

ఇక మూసీ ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో 30 గేట్లను అమర్చారు. ఐతే నిర్వహణ ఇబ్బందిగా మారుతోందని 1990లో 10 గేట్లను కాంక్రీట్‌తో మూసివేసింది ప్రభుత్వం. ప్రస్తుతం వరద పెరగడంతో అతి కష్టం మీద 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నిర్వహణ సమస్యలతో 7 గేట్లు ఎత్తడానికి అసలు అవకాశమే లేకుండా పోయింది. భారీ వరదతో డ్యాంకు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మూసీ పరివాహక ప్రాంతంలో 24 గంటల్లో 20 నుంచి 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఆ నీరంతా ఒక్కసారిగా మూసీలోకి పోటెత్తడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఉప్పుల్‌ నల్లచెరువు కట్ట తెగటంతో ఆ నీరు నేరుగా మూసీలో కలుస్తోంది. ఇటు ప్రతాస్‌ సింగారం, గౌరవెల్లి, బండరావిరాల, అనంతారం, రుద్రవెల్లి, భూదాన్‌ పోచంపల్లిలోని చాలా చోట్ల మూసీపరివాహక ప్రాంతాలూ పూర్తిగా మునిగిపోయాయి. చిన్న రావులపల్లి -భట్టుగూడెం దగ్గర బ్రిడ్జ్‌ నీట మునిగింది. దీంతో మూసీకి ఇరువైపులా అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.

గువ్వలేడు సమీపంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరాన నిర్మించిన గంగమ్మగుడి పూర్తిగా నీట మునిగింది. ఇటు రుద్రవల్లి దగ్గర కూడా మూసీనది ఉగ్రరూపం దాల్చింది. మూసీనదీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రవహాహాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇటు వరిచేలు కోతకు వచ్చిన దశలో కురిసిన కుంభవృష్టికి మూసీ ఆయకట్టులోని చాలా చోట్ల వరిచేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు బోరున విలపిస్తున్నారు.