Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివిసీమ ఉప్పెనకు 42 ఏళ్ళు.. ట్రాజెడీ నీడలింకా ఉన్నాయా?

దివిసీమ ఉప్పెనకు నేటితో 42 ఏళ్ళు పూర్తయ్యాయి. 1977 నవంబరు 19వ తేదీ దివిసీమలోని దాదాపు 15 గ్రామాలు రోజూలాగానే నిద్ర లేచాయి. పనిపాటల్లో నిమగ్నమయ్యాయి. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిరుజల్లులతో మొదలైన వర్షం పెనుతుఫానుగా మారింది. ఒక్కసారిగా ప్రళయం ముంచెత్తింది. రాకాసి అలలు రెండు తాటి చెట్లంత ఎత్తులో ఊళ్ళ మీద విరుచుకుపడ్డాయి. గంటకు 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచాయి. దీంతో అక్కడి ప్రజలు […]

దివిసీమ ఉప్పెనకు 42 ఏళ్ళు.. ట్రాజెడీ నీడలింకా ఉన్నాయా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 19, 2019 | 12:42 PM

దివిసీమ ఉప్పెనకు నేటితో 42 ఏళ్ళు పూర్తయ్యాయి. 1977 నవంబరు 19వ తేదీ దివిసీమలోని దాదాపు 15 గ్రామాలు రోజూలాగానే నిద్ర లేచాయి. పనిపాటల్లో నిమగ్నమయ్యాయి. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిరుజల్లులతో మొదలైన వర్షం పెనుతుఫానుగా మారింది. ఒక్కసారిగా ప్రళయం ముంచెత్తింది. రాకాసి అలలు రెండు తాటి చెట్లంత ఎత్తులో ఊళ్ళ మీద విరుచుకుపడ్డాయి. గంటకు 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్ళను వదలి గుడినో, బడినో చేరుకునే ప్రయత్నం చేశారు. గ్రామాలలో వున్న పెద్ద ఇళ్ళ వైపుకు పరుగులు తీశారు. అయినా దేనికీ అవకాశం ఇవ్వలేదు. కాలు కదపనివ్వలేదు. కాళ్ళ కింద నేల ఫెళ్ళున కూలినట్లు, ఎవరు ఎటుపోయారో… ఏమైపోయారో… రెండు గంటల తరువాత అంతా నిర్మానుష్యం.

ఊళ్ళు లేవు. ఊళ్ళల్లో జనం లేరు. ఊళ్ళన్నీ వల్లకాడులా మారాయి. అనధికార లెక్కల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 50 వేలు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మంది. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 172 కోట్ల (ఇప్పటి లెక్కల్లో దాదాపు 25 వేల కోట్లు) ఆస్తి నష్టం జరిగింది. 33 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. రెండున్నర లక్షల పశువులు, నాలుగు లక్షల కోళ్ళు గల్లంతయ్యా యి. ఒక్క భావదేవరపల్లిలోనే వెయ్యిమందికి పైగా విగతజీవులయ్యారు. హంసలదీవి, పాయకాల తిప్ప తుఫాను ధాటికి అతలాకుతలమయ్యాయి. రామాలయం గుడిలో చేరిన 69 మంది అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సోర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ ప్రాంతాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ విషాద సంఘటన ప్రపంచానికి రెండు రోజుల వరకు తెలియలేదు.

ఈ దివిసీమ ఉప్పెనకు చలించిన భావదేవరపల్లి గ్రామస్తుడైన మండలి వెంకట కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం దివిసీమ వైపు కదలక తప్పలేదు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావుతో సహా పలువురు క్యాబినెట్‌ మంత్రులు, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్ వంటి నాయకులు ఢిల్లీ వీడి దివిసీమకు వచ్చారు. పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. మృతి చెందిన వారి స్మృత్యర్ధం ఏటేటా దివిసీమ అంతటా శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు.