రాహుల్ ట్వీట్‌తో రేగిన దుమారం..ఏ విషయంలో అంటే ?

బిజెపి నిధుల సమీకరణపై రాహుల్, ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. అవినీతి సొమ్ముతోనే బిజెపి ఖజానా నింపుతున్నారంటూ ప్రియాంక గాంధీ వధేరా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన సోదరి ప్రియాంక వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ.. కొత్త భారతావనిలో అవినీతి సొమ్మును ఎలక్టోరల్ బాండ్స్ అని పిలుస్తారంటూ ట్వీట్ చేశారు. ఒకవైపు ప్రియాంకా గాంధీ వధేరా వ్యాఖ్యలు, మరోవైపు రాహుల్ గాంధీ ట్వీట్లు జాతీయ స్థాయిలో […]

రాహుల్ ట్వీట్‌తో రేగిన దుమారం..ఏ విషయంలో అంటే ?
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 19, 2019 | 12:23 PM

బిజెపి నిధుల సమీకరణపై రాహుల్, ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. అవినీతి సొమ్ముతోనే బిజెపి ఖజానా నింపుతున్నారంటూ ప్రియాంక గాంధీ వధేరా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన సోదరి ప్రియాంక వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ.. కొత్త భారతావనిలో అవినీతి సొమ్మును ఎలక్టోరల్ బాండ్స్ అని పిలుస్తారంటూ ట్వీట్ చేశారు. ఒకవైపు ప్రియాంకా గాంధీ వధేరా వ్యాఖ్యలు, మరోవైపు రాహుల్ గాంధీ ట్వీట్లు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి.

ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో నిధులు సమీకరించిన పార్టీగా బిజెపి నిలిచింది. 700 కోట్ల రూపాయలకు పైగా బిజెపి గత ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఫండ్స్ రాబట్టుకుంది. అయితే.. ఎన్నికల సంవత్సరం కావడంతో బిజెపికి నిధులు వెల్లువగా వచ్చాయన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. గత అయిదేళ్ళలో నరేంద్ర మోదీ సాయం చేసిన వ్యక్తులు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు బిజెపికి ఎలక్టోరల్ బాండ్స్ పేరిట నిధులను కట్టబెట్టారని, ఇది పరోక్షంగా క్విడ్ ప్రో ఖో అని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.

ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడంలో మోదీ ప్రభుత్వం ఆర్బీఐ చేతులు కట్టేసిందని ప్రియాంక ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మరో అడుగు ముందుకేసి, మోదీ ప్రభుత్వ క్విడ్ ప్రో ఖో ఒప్పందాలకు అనుగుణంగానే బిజెపికి ఫండ్స్ వెల్లువలా వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మనీ లాండరింగ్‌ను ఎంకరేజ్ చేసేదిగా వుందని, అసలు బిజెపికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చందాలిచ్చిన వారి వివరాలను బహిర్గతం చేయాలని రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కూడా దుమారం రేపుతోంది. ‘‘న్యూ ఇండియాలో లంచాలు, చట్ట వ్యతిరేక వసూళ్ళను ఎలక్టోరల్‌ బాండ్లు అని పిలుస్తారు’’ అంటూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతటితో ఆగని రాహుల్ గాంధీ ఎలక్టోరల్‌ బాండ్లపై ‘హఫింగ్టన్‌ పోస్ట్‌’లో వచ్చిన స్టోరీని కూడా లింక్‌ చేశారు.

ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిందేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో వున్న పార్టీకి నిధులు ఎక్కువ స్థాయిలో రావడం సహజమేనని, దాన్ని అవినీతి డబ్బుగా చెప్పడం కరెక్టు కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బిజెపికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా చందాలిచ్చిన వారి జాబితా వెల్లడైతే పెద్ద రాజకీయ దుమారానికే దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.