AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foot corns: పాదాల్లో ఆనెలు ఎందుకు వస్తాయి..? ఇవి ప్రమాదకరమా..?

పాదాల్లో ఆనెలు చర్మం గట్టిపడి గడ్డల్లా మారడం వల్ల ఏర్పడతాయి. ఎక్కువ ఒత్తిడి, చెప్పులు లేకుండా నడవడం, అధిక బరువు వంటివి ప్రధాన కారణాలు. ఆనెలను నివారించడానికి సరైన పాదరక్షలు, పాదాల పరిశుభ్రత ముఖ్యం. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల నొప్పిని తగ్గించి, సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Foot corns: పాదాల్లో ఆనెలు ఎందుకు వస్తాయి..? ఇవి ప్రమాదకరమా..?
Foot Corns
Ram Naramaneni
|

Updated on: Feb 05, 2026 | 3:09 PM

Share

పాదాల్లో ఆనెలు (ఫుట్ కార్న్స్) గురించి వైద్య నిపుణులు అందిస్తున్న పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనెలు చూడటానికి పెద్ద సమస్యలా అనిపించకపోయినా, అవి రోజువారీ కార్యకలాపాలకు, ముఖ్యంగా నడిచేటప్పుడు తీవ్రమైన అసౌకర్యాన్ని, నొప్పిని కలిగిస్తాయి. అసలు ఆనెలు అంటే ఏమిటి, అవి ఎందుకు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, చికిత్స.. నివారణ పద్ధతుల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకుందాం.

ఆనెలు అంటే ఏమిటి?

ఆనెలు అంటే శరీరంలోని చర్మం గట్టిపడి, ఒక గడ్డలాగా ఏర్పడటం. ఇవి సాధారణంగా పాదాల్లో కనిపిస్తాయి, అయితే కొన్నిసార్లు చేతుల్లో కూడా ఏర్పడవచ్చు. చర్మంపై నిరంతరం ఒత్తిడి లేదా ఘర్షణ పడటం వల్ల రక్షణ కోసం చర్మం మందంగా మారడం దీనికి ప్రధాన కారణం.

ఆనెలు ఏర్పడటానికి కారణాలు:

అధిక ఒత్తిడి: పాదాలపై ఏదైనా ఒక పాయింట్‌పై దీర్ఘకాలం పాటు అధిక ఒత్తిడి పడటం వల్ల చర్మం గట్టిపడుతుంది. నడిచేటప్పుడు పాదాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

చెప్పులు లేకుండా నడవడం: గరుకు ఉపరితలాలపై చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి, ఆనెలు ఏర్పడతాయి.

అధిక బరువు: అధిక బరువు ఉన్నవారి పాదాలపై ఎక్కువ భారం పడి, ఆనెలు రావడానికి దారితీస్తుంది.

అబ్నార్మల్ గేట్ (నడిచే పద్ధతిలో లోపం): కొంతమందికి కాళ్ళలోని ఎముకల అమరిక సరిగా ఉండదు. దీని వల్ల నడిచేటప్పుడు పాదం ఒక వైపు అధిక ఒత్తిడికి గురై, ఆనెలు ఏర్పడతాయి. సరిగ్గా పాదం మొత్తం నేలపై ఆనించకుండా నడిచే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

గట్టి  చెప్పులు: గట్టి చెప్పులు లేదా సరిగా సరిపోని పాదరక్షలు ధరించడం వల్ల కూడా ఆనెలు వస్తాయి.

వృత్తి సంబంధిత కారణాలు: ఎక్కువ బైక్ డ్రైవ్ చేసేవారు లేదా బరువైన వస్తువులను ఎత్తేవారి చేతుల్లో కూడా చర్మం గట్టిపడటం గమనించవచ్చు, ఇది ఆనెల  ప్రారంభ రూపం.

లక్షణాలు: ఆనెలు వస్తున్నాయని గుర్తించడానికి మొదటి లక్షణం చర్మం గట్టిపడటం. ఇది సాధారణంగా పాదాల్లోని బొటనవేలు కింద, ఎముకల ప్రామినెన్సెస్ వద్ద ఎక్కువగా కనిపిస్తుంది. చర్మం గట్టిపడటాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది నొప్పిని కలిగించే ఆనెలుగా మారుతుంది. నడిచినప్పుడు నొప్పి రావడం సాధారణం.

ఆనెలు రాకుండా నివారించడం లేదా ప్రారంభ దశలోనే వాటిని తగ్గించుకోవడం ముఖ్యం:

ఒత్తిడి తగ్గించడం: చర్మం గట్టిపడటం మొదలైనప్పుడు, ఆ ప్రాంతంపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

సరియైన పాదరక్షలు: మృదువైన, సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి. గట్టి లేదా బిగుతైన పాదరక్షలను నివారించాలి.

పాదాల పరిశుభ్రత: పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

మాయిశ్చరైజర్‌లు: చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్‌లను ఉపయోగించి మృదువుగా ఉంచాలి.

బరువు తగ్గడం: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం వల్ల పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది.

ఎముకల అసాధారణతలకు చికిత్స: కాళ్ళలోని ఎముకల అమరికలో ఏదైనా లోపాలు ఉంటే, వాటిని సరిచేయించుకోవడం వల్ల ఆనెలు ఏర్పడకుండా నివారించవచ్చు.

చికిత్స: ఆనెలు ఏర్పడినట్లయితే నిపుణులైన వైద్యులు దానికి చికిత్స అందిస్తారు. ఆనెలు పూర్తిగా పెరిగినప్పుడు, ఆ గడ్డను సర్జికల్ పద్ధతిలో జాగ్రత్తగా కట్ చేసి తొలగిస్తారు. చికిత్స తర్వాత కూడా పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం, మాయిశ్చరైజర్‌లు ఉపయోగించడం, మృదువైన పాదరక్షలు ధరించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఆనెలు మళ్లీ రాకుండా చూసుకోవచ్చు. ఆనెలు కేవలం ఒక సౌందర్య సమస్య కాదని, సరైన సమయంలో చికిత్స చేయకపోతే నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుందని గుర్తించడం ముఖ్యం. నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రారంభ దశలోనే వైద్య సహాయం పొందడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

(ఈ కథనం వైద్య నిపుణుల నుంచి సేకరించబడింది)