ఏపీ నెత్తిన ఆంగ్లం బండ.. సర్కారీ ఉత్తర్వుల సారాంశమేంటంటే ?

ఆంధ్రప్రదేశా లేక ఆంగ్ల ప్రదేశా.. ఈ ప్రశ్న తాజాగా ఏపీని కుదిపేయడం మొదలు పెట్టింది. పదో తరగతి వరకు ఇంగ్లీష్ భాష కంపల్సరీ అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీలో దుమారానికి తెరలేపాయి. తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారుస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంతో మాతృభాషలను చంపేస్తున్నారని భాషాభిమానులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం- ఆంగ్ల పాఠశాలలవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌ ఇస్తోంది. సర్కారీ బడులు- ఇంగ్లీష్‌ […]

  • Rajesh Sharma
  • Publish Date - 6:05 pm, Thu, 7 November 19
ఏపీ నెత్తిన ఆంగ్లం బండ.. సర్కారీ ఉత్తర్వుల సారాంశమేంటంటే ?
ఆంధ్రప్రదేశా లేక ఆంగ్ల ప్రదేశా.. ఈ ప్రశ్న తాజాగా ఏపీని కుదిపేయడం మొదలు పెట్టింది. పదో తరగతి వరకు ఇంగ్లీష్ భాష కంపల్సరీ అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీలో దుమారానికి తెరలేపాయి. తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారుస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంతో మాతృభాషలను చంపేస్తున్నారని భాషాభిమానులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం- ఆంగ్ల పాఠశాలలవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌ ఇస్తోంది. సర్కారీ బడులు- ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారితే లాభమా, నష్టమా ఈ ప్రశ్న ఇపుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో మొదలైంది. 
ప్రభుత్వ పాఠశాల్ని ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ మార్చాలన్న అంశంపై అక్టోబర్ నెల 29వ తేదీన ప్రొఫెసర్‌ కె.బాలకృష్ణన్‌, సుధా నారాయణమూర్తి తదితర విద్యావేత్తల కమిటీతో ఏపీ సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి ఈనెల 5వ తేదీన జీవో నెంబర్‌ 81ని జారీచేసి- కార్యాచారణ ప్రణాళిక ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సర్కారీ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌కి బదులు CBSE సిలబస్‌ను ప్రవేశపెడతారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉంటుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులో ఉంటుంది. ఈ జీవోపై విమర్శలు వస్తున్నాయి. 81వ జీవో చారిత్రక తప్పిదమనీ, మాతృభాషను మృతభాషగా చేయడమేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. పలు తెలుగు భాషా సంఘాలు ప్రభుత్వ చర్యను తప్పు పడుతున్నాయి. ఈ చర్య ద్వారా పిల్లల్లో తెలుగు నేర్చుకోవాలన్న కోరిక చచ్చిపోతుందని, భావితరాలకు తెలుగు భాష రాని దుస్థితి ఏర్పడుతుందని ఈ సంఘాలు వాదిస్తున్నాయి.
కానీ మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా యువతలో భాషా పరిఙ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. తెలుగు భాష పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే ఆంగ్ల భాషా పరిఙ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా బెటర్ ఉద్యోగావకాశాలు యువతకు అందేలా చూడాన్నదే తమ అభిమతమని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అంటున్నారు.
మరోవైపు టిడిపి జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టారు. ”తెలుగు’లెస్సేనా’, ఎందుకింత తెగులు..?”,”ఏకపక్ష నిర్ణయం..,విద్యకు దూరమయ్యే ప్రమాదం”, ”మాతృభాషపై అంత అక్కసు ఎందుకో” ”డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతాయి, విద్యార్థులకు నష్టమే” ఇవన్నీ నేను ఇప్పుడు అంటున్నవి కావు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలి… అది కూడా విద్యార్థులకు ఇష్టమైతేనే.. అని నిర్ణయం తీసుకున్నపుడు వైసీపీ నాయకుల కూతలు ఇవి.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నారా లోకేశ్.  
ప్రభుత్వ తొందరపాటు చర్యల వలన  తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం హడావిడి గా ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చెయ్యాలని టిడపి నేతలు కోరుతున్నారు.