AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీకి పట్టం కట్టిన పల్లె, పట్టణ ప్రజలు..!

దుబ్బాక కోటపై బీజేపీ జెండా ఎగిరింది. సంచలన విజయం కైవసం చేసుకుంది. అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లోనూ బీజేపీకే పట్టం కట్టారు.

బీజేపీకి పట్టం కట్టిన పల్లె, పట్టణ ప్రజలు..!
Balaraju Goud
|

Updated on: Nov 10, 2020 | 8:28 PM

Share

దుబ్బాక కోటపై బీజేపీ జెండా ఎగిరింది. సంచలన విజయం కైవసం చేసుకుంది. అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లోనూ బీజేపీకే పట్టం కట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా ఇప్పటి వరకూ సమీకరణాలు చూసుకుంటే…

దుబ్బాక మండలంలో బీజేపీ ఆధిక్యం సాధించింది. మొదటి రౌండు నుంచి అయిదు రౌండ్ వరకూ బీజేపీ ఆధిక్యంలోనే దూసుకెళ్లింది. దుబ్బాక నియోజకవర్గంలో 45 వేల 586 ఓట్లు పోలవ్వగా…అందులో బీజేపీకి 20 వేల 226 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 17 వేల 559 ఓట్లు వచ్చాయి. ఇటు బీజేపీ అభ్యర్థి రఘునందనరావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ఇద్దరూ ఒకే మండలానికి చెందిన వారు. ఓటర్లు మాత్రం బీజేపీవైపే మొగ్గు చూపారు.

దుబ్బాక విజేత‌ను డిసైడ్ చేసిన చేగుంట మండ‌లంలో బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ 26 వేల 282 ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 10 వేల 301 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ 9 వేల 528 ఓట్లతో సరిపెట్టుకుంది. ఈ మండలం ఓట్లే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా మారింది. ఇక మిరుదొడ్డి మండలంలోనూ బీజేపీ ఆధిక్యత కనబర్చింది. మొత్తం 25 వేల 765 ఓట్లు పోలవ్వగా… ఇందులో బీజేపీకి 10 వేల 615 ఓట్లు రాగా… టీఆర్‌ఎస్‌ 9 వేల 152 ఓట్లను రాబట్టింది.

అటు, తొగుట మండలంలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం లభించింది. ఇక్కడ 22 వేల 334 ఓట్లు పోలవ్వగా.. టీఆర్‌ఎస్‌కు 8 వేల 529 ఓట్లు రాగా… బీజేపీ 8 వేల 8 ఓట్లతో సరిపెట్టుకుంది. దౌల్తాబాద్‌ మండలంలోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబర్చింది. ఈ మండలంలో మొత్తం19 వేల 708 ఓట్లు పోల్‌ అవ్వగా… టీఆర్‌ఎస్‌కు 8 వేల 221 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 6 వేల 610 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక రాయపోల్‌ మండలంలోనూ టీఆర్‌ఎస్‌ కారు దూసుకెళ్లింది. ఇక్కడ మొత్తం 17 వేల 352 ఓట్లు పోలవ్వగా… అందులో టీఆర్‌ఎస్‌ 6 వేల 160 ఓట్లను రాబట్టింది. ఇక బీజేపీకి 4 వేల 221 ఓట్లతో సరిపెట్టుకుంది.

ఇక చివరి మండలం నార్సింగ్‌లోనూ బీజేపీకి ఆధిక్యత లభించింది. ఇక్కడ 6 వేల 806 ఓట్లు పోలవ్వగా… బీజేపీకి 2 వేల 867 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 2 వేల 541 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా చూసుకుంటే బీజేపీ 4 మండలాల్లో ఆధిక్యత కనబర్చగా… టీఆర్‌ఎస్‌ 3 మండలాలతో సరిపెట్టుకుంది. మొత్తం మీద తుది వరకు ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు జోరుకు బ్రేకులు వేస్తూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయకేతనం ఎగురవేశారు.