AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fish vs Fresh Fish: పచ్చి చేపలు vs ఎండు చేపలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి..? నమ్మలేని నిజాలు ఇవే..

ఆరోగ్యానికి పచ్చి చేపలతో సమానంగా ఎండు చేపలు కూడా మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. చేపల మార్కెట్లో పచ్చి, ఎండు చేపలు రెండు రకాలు అందుబాటులో ఉంటాయి. పచ్చి చేపల కంటే ఎండు చేపలు కొన్ని విషయాల్లో అధిక ప్రయోజనాలను అందిస్తాయి.. పోషకాహార నిపుణుల ప్రకారం, ఎండు చేపలలో పచ్చి చేపల కన్నా అధిక ప్రొటీన్లు ఉంటాయి. నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

Dry Fish vs Fresh Fish: పచ్చి చేపలు vs ఎండు చేపలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి..? నమ్మలేని నిజాలు ఇవే..
Fish Vs Dry Fish
Shaik Madar Saheb
|

Updated on: Mar 26, 2026 | 3:54 PM

Share

నాన్ వెజ్ ప్రియులు చేపలను ఇష్టంగా తింటారు.. ఆరోగ్యానికి పచ్చి చేపలతో సమానంగా ఎండు చేపలు కూడా ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి చేపల మార్కెట్లో పచ్చి చేపలు, ఎండు చేపలు రెండు రకాలు లభిస్తాయి. అయితే, పచ్చి చేపల కన్నా ఎండు చేపలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమైనవిగా పరిగణించబడుతున్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ముఖ్యంగా, ఎండు చేపల వినియోగంతో ముడిపడి ఉన్న భారీ లోహ కాలుష్యం, అధిక సోడియం కంటెంట్ వంటి ఆరోగ్య ప్రమాదాలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలంటున్నారు. అయితే.. నిపుణుల ప్రకారం.. అయితే.. పచ్చి చేపల కన్నా.. ఎండుచేపల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఎండు చేపలు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు చేపలు (Dry Fish) అధిక ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలం.. ఇవి ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, జలుబు, దగ్గు ఫ్లూ లక్షణాలను తగ్గించడం అలాగే.. బరువు తగ్గడంలో ఇవి దోహదపడతాయి. ఇవి చౌకగా లభించడంతోపాటు.. ఎక్కువ కాలం నిల్వ ఉండే పౌష్టికాహారమని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి చేపలు vs ఎండు చేపలు..

వివిధ సర్వేల ప్రకారం, భారత్ లో చేపలు తినే అలవాటు ఉన్నవారిలో 90 శాతం మంది పచ్చి చేపలను ఎంచుకుంటారు.. కేవలం 10 శాతం మంది మాత్రమే ఎండు చేపలను వినియోగిస్తారు. ఎండువైనా, పచ్చివైనా చేపలన్నింటిలోనూ దాదాపు ఒకే తరహా ప్రాథమిక పోషకాలు ఉంటాయి. అయితే, పోషకాల సాంద్రతలో గణనీయమైన తేడా ఉంటుంది. పచ్చి చేపలో సాధారణంగా 18 నుంచి 20 శాతం ప్రొటీన్ ఉండగా, ఎండు చేపలో ఇది 60 శాతం వరకు ఉంటుంది. ఈ తేడాకు ప్రధాన కారణం నీటి శాతం. పచ్చి చేపలో 60 నుంచి 80 శాతం నీరు ఉంటుంది. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల సూక్ష్మక్రిములు సులభంగా చేరి, చేపలు త్వరగా పాడైపోతాయి. దీనికి విరుద్ధంగా, ఎండు చేపలో నీరు దాదాపు పూర్తిగా ఎండిపోతుంది.

అందువల్ల, ఎండు చేపలలోకి సూక్ష్మక్రిములు చేరవు.. అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎండు చేపలను గది ఉష్ణోగ్రత వద్ద ఆరు నెలల వరకు పాడవకుండా నిల్వ చేయవచ్చు. నిల్వ ఉంచినప్పటికీ, రుచిలో ఎటువంటి మార్పు ఉండదని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. నీరు పూర్తిగా తొలగిపోవడం వల్ల ఎండు చేపలలో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్స్ అధిక మొత్తంలో కేంద్రీకృతమై ఉంటాయి. పచ్చి చేపలను గరిష్టంగా వారం రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు, కానీ ఎండు చేపలకు నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. అయితే, ఎండు చేపల ప్రత్యేకమైన వాసన కారణంగా చాలామంది వాటిని ఇంట్లో నిల్వ చేయడానికి ఇష్టపడరు.

చేపలు బాగా ఎండేందుకు, సూక్ష్మక్రిములు దరిచేరకుండా ఉండేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వాటికి ఉప్పును అధికంగా రాస్తారు. ఈ కారణంగా, అధిక రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు ఉన్నవారు ఎండు చేపలను తినడం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తారు. ఎండు చేపలలోని అధిక ఉప్పు శాతాన్ని తగ్గించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వండేటప్పుడు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటిలో అరగంట పాటు మరిగించడం ద్వారా ఉప్పు దాదాపుగా తొలగిపోతుంది. అలాగే, ఎండు చేపలను నీటిలో వేసి బాగా కడగడం ద్వారా కూడా వాటిలోని ఉప్పును తగ్గించవచ్చు. పచ్చి చేపలను 65 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే అందులో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అదేవిధంగా, మైనస్ 4 డిగ్రీల వద్ద నిల్వ చేసినా సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఎన్నో పోషకాలు..

తాజా చేపలతో పోలిస్తే ఎండిన చేపలు సాధారణంగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.. పోషకాల విషయానికి వస్తే, ఒక కిలో పచ్చి చేప నుంచి సుమారు 20 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అదే ఒక కిలో ఎండు చేప నుంచి 600 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అందుకే, పోషకాల పరంగా చూస్తే, ఎండు చేపలే విజేత అని చెప్పవచ్చు. దీనికి కారణం ఎండు చేపలో నీరు ఉండకపోవడం, పచ్చి చేపలో నీరు అధికంగా ఉండటం. అయితే, ఆరోగ్యపరంగా చూసుకుంటే, పచ్చి చేపలైనా, ఎండు చేపలైనా రెండూ మంచివే. రెండింటిలోనూ మన ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలే ఉంటాయి. ఎండు చేపలలోనూ, పచ్చి చేపలలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్లు డి, ఏ, కే, బీ12 ఉంటాయి. జింక్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్, రాగి, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఎక్కువ రోజులు చేపలను నిల్వ ఉంచడం వల్ల వాటిలోని విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పోవు. పచ్చి చేపలను కూడా వారం వరకు నిల్వ ఉంచి తినవచ్చు, వాటిలోనూ ఎటువంటి పోషకాలు తగ్గవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వాస్తవానికి పచ్చి చేప.. ఎండు చేపలు రెండూ మంచివే.. ఏమైనా సమస్యలుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us