Youth Movie Review: యూత్ మూవీ రివ్యూ.. పాతికేళ్ళ కుర్రాడు డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉంది..?
నేటితరం యువత ఆలోచనలు, ప్రేమకథలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వచ్చిన సినిమా యూత్. కెన్ కరుణాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. తెరకెక్కించిన చిత్రం ఇది. మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా రూపొందిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: యూత్
నటీనటులు: కెన్ కరుణాస్, మీనాక్షి దినేష్, అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విక్కీ
ఎడిటర్: నాష్
రచన, దర్శకత్వం: కెన్ & గ్యాంగ్
నిర్మాతలు: కరుప్పయ్య సి. రామ్, సులోచన కుమార్
నేటితరం యువత ఆలోచనలు, ప్రేమకథలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వచ్చిన సినిమా యూత్. కెన్ కరుణాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. తెరకెక్కించిన చిత్రం ఇది. మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా రూపొందిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం..
కథ:
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగిన కుర్రాడు ప్రవీణ్ (కెన్ కరుణాస్). కాలేజ్, స్నేహితులు, ప్రేమ.. ఇలా సాగిపోయే ప్రవీణ్ జీవితంలోకి ఒకేసారి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షి యాదవ్), కనగవల్లి (అనిష్మా అనిల్ కుమార్).. ఈ ముగ్గురితో ప్రవీణ్‌కు ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత ఎదురైన బ్రేకప్స్ అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయి? మరోవైపు తన తల్లిదండ్రులు ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు), సరోజ (దేవదర్శిని)లతో ప్రవీణ్‌కు ఉన్న బాండింగ్ ఏంటి? ప్రేమలో దెబ్బతిని, జీవితం పట్ల కన్ఫ్యూజన్‌లో ఉన్న ఒక యువకుడు.. తన పేరెంట్స్ సపోర్ట్‌తో తనని తాను ఎలా అర్థం చేసుకున్నాడు? జీవితంలో ఏం సాధించాడు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్.
కథనం:
ప్రతీ ఒక్కరి జీవితంలో యూత్ అనేది ముఖ్యం.. స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది.. అప్పుడొచ్చే ఆలోచనలు, పుట్టే ప్రేమలు కొత్తగా అనిపిస్తుంటాయి. ఆ సమయంలో చేసే పనులు, వాటి వల్ల కలిగే బాధను దర్శకుడు కెన్ కరుణాస్ చాలా సహజంగా తెరమీదకు తీసుకొచ్చాడు. కథగా చూసుకుంటే ఇందులో మనం ఇదివరకు చూడని కొత్త పాయింట్ ఏమీ లేదు. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు, బ్రేకప్స్, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇదంతా మనకు తెలిసిన టెంప్లేట్ కథ.. కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, రాసుకున్న రిలేటబుల్ ఎలిమెంట్స్ వల్ల సినిమా ఎంగేజింగ్‌గా మారుతుంది. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో కూల్‌గా సాగిపోతుంది. నేటితరం లవ్ స్టోరీస్, వారి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా తీసిన సీన్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్ వచ్చేసరికి సినిమా టోన్ పూర్తిగా మారుతుంది. ఫన్ మోడ్ నుంచి ఫ్యామిలీ డ్రామా వైపు కథ మలుపు తిరుగుతుంది. పిల్లల ఆలోచనలకు, తల్లిదండ్రుల ఆలోచనలకు మధ్య ఉండే జనరేషన్ గ్యాప్‌ని, ఫ్యామిలీ వాల్యూస్‌ని దర్శకుడు నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు. తెలిసిన కథే కాబట్టి తర్వాత ఏం జరుగుతుందనేది ముందే ఊహించగలం. కానీ దర్శకుడు కెన్ తన డైరెక్షన్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా, ఫ్లో మిస్ అవ్వకుండా సినిమాను నడిపించాడు. నేటితరం యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ సినిమాకు ప్లస్. అయితే పెద్దగా కొత్తదనం లేని రొటీన్ స్టోరీ లైన్.. సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్ మైనస్ అయ్యాయి. కథలో కొత్తదనం లేకపోయినా, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, మంచి మ్యూజిక్ సినిమాను పాస్ మార్కులతో గట్టెక్కిస్తాయి. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, ఈ వీకెండ్‌లో యూత్ అండ్ ఫ్యామిలీ కలిసి సరదాగా చూడదగ్గ డీసెంట్ అటెంప్ట్ యూత్.
నటీనటులు:
కెన్ కరుణాస్ ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే.. హీరోగా తన బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. ప్రవీణ్ పాత్రలో ఒక సాధారణ కుర్రాడిగా చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్‌గా నటించాడు. ఎమోషనల్ సీన్లలో అతని పరిణతి కనిపిస్తుంది. హీరోయిన్లు మీనాక్షి దినేష్, అనిష్మా, ప్రియాన్షి యాదవ్.. ముగ్గురికీ స్క్రీన్ స్పేస్ సమానంగా దక్కకపోయినా, ఉన్నంతలో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో పేరెంట్స్‌గా నటించిన సూరజ్ అండ్ దేవదర్శిని నటన సినిమాకు ప్రాణం. సెకండాఫ్‌కి వీళ్లే ప్రాణం. ఉన్నికృష్ణన్, సరోజ పాత్రల్లో తమ అపారమైన అనుభవంతో సినిమా స్థాయిని పెంచారు. క్లైమాక్స్‌కి ముందు వీరు పండించిన ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు పెద్ద పిల్లర్. యూత్‌ఫుల్ లవ్ ట్రాక్స్‌కి తగ్గట్లే బ్రీజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కాకపోతే తెలుగు గాయకుల విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎమోషనల్ సీన్లలో ఆయన మ్యూజిక్ సినిమాకి సోల్ లాంటిది. విక్కీ కెమెరా వర్క్ సినిమా మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అయితే ఎడిటర్ నాష్ వర్క్ విషయంలో కాస్త అసంతృప్తి మిగులుతుంది. కథను ఇంకాస్త క్రిస్ప్‌గా చెప్పే అవకాశం ఉన్నా, కొన్ని సీన్లను ఎడిట్ చేయకుండా అలాగే వదిలేశాడు. దీనివల్ల రన్‌టైమ్ కాస్త పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. దర్శకుడిగా కెన్ పర్లేదనిపించాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా యూత్.. పర్లేదు ఓసారి చూడొచ్చు..!
