ఆ తాబేళ్లు ఫొని తుఫానును ముందే పసిగట్టాయా?

ప్రకృతి వైపరిత్యాలు వచ్చే ముందు జంతువులు వాటిని ముందే పసిగడుతాయని ఎంతో మంది అభిప్రాయపడుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా ఫొని తుఫాన్ నేపథ్యంలో కూడా ఒడిషా ప్రాంతానికి ఆ తాబేళ్లు రాకపోవడంతో జలచరాలు కూడా ప్రకృతి వైపరిత్యాలను ముందే గుర్తిస్తాయా అన్న అనుమానం తలెత్తుతోంది. ఒడిశా తీర ప్రాంతానికి పర్యాటకపరమైన గుర్తింపే కాదు, పర్యావరణ పరిరక్షణ పరంగానూ ఎంతో పేరుంది. ఇక్కడి బీచ్‌లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు […]

ఆ తాబేళ్లు ఫొని తుఫానును ముందే పసిగట్టాయా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 03, 2019 | 9:54 PM

ప్రకృతి వైపరిత్యాలు వచ్చే ముందు జంతువులు వాటిని ముందే పసిగడుతాయని ఎంతో మంది అభిప్రాయపడుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా ఫొని తుఫాన్ నేపథ్యంలో కూడా ఒడిషా ప్రాంతానికి ఆ తాబేళ్లు రాకపోవడంతో జలచరాలు కూడా ప్రకృతి వైపరిత్యాలను ముందే గుర్తిస్తాయా అన్న అనుమానం తలెత్తుతోంది.

ఒడిశా తీర ప్రాంతానికి పర్యాటకపరమైన గుర్తింపే కాదు, పర్యావరణ పరిరక్షణ పరంగానూ ఎంతో పేరుంది. ఇక్కడి బీచ్‌లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఇక్కడి సహజసిద్ధమైన బీచ్ లు ఆ తాబేళ్ల పునరుత్పుత్తికి ఎంతో అనువుగా ఉంటాయి. సాధారణంగా వేసవిలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు ఒడిశా తీరప్రాంతానికి వస్తుంటాయి. అయితే, ఈ ఏటా వాటి సందడి ఇక్కడ కనిపించలేదు. కేవలం 3000 కంటే తక్కువ సంఖ్యలోనే ఇక్కడి రుషికుల్య తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నాయి. కాగా, ఇదే సమయంలో గతేడాది 5 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లు రుషికుల్య వద్ద సందడి చేశాయి. తాబేళ్ల సంఖ్యలో ఇంత భారీ వ్యత్యాసం కనిపించడం ఫొని తుపాను ప్రభావమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అనేక జీవజాతులకు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించే శక్తి ఉంటుందని, ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు కూడా ఫొని తుఫాను రాకను ముందే పసిగట్టి తీరానికి దూరంగా ఉండిపోయాయని పర్వీన్ కాశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అయితే, గహిర్మత బీచ్ కు మాత్రం ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎప్పట్లానే పెద్ద ఎత్తున వచ్చాయి. మరి ఈ తాబేళ్లు తుఫాను గురించి ముందుగా పసిగట్టలేకపోయాయా? అంటే సమాధానం దొరకడంలేదు.