ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్.!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు.
Lockdown In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. టెస్టులు పెంచే కొద్దీ ఎక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులో ఉంది. అటు తూర్పుగోదావరిలోని రావులపాలెంలో ఇవాళ్టి నుంచి ఆగష్టు 9 వరకు కఠిన లాక్ డౌన్ విధించారు. ఇక జిల్లాలో ప్రతీ ఆదివారం యధావిధిగా 24 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో మరో వారం పాటు లాక్ డౌన్‌ను అధికారులు పొడిగించారు.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో నెల్లూరులో కూడా ఆగష్టు 8 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తూ అధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. అటు ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా ఈ నెల 10వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగించారు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో మాత్రమే నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చుకోవడానికి అనుమతించారు. అలాగే ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఏపీలో ఇప్పటివరకు 1,50,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 72,188 యాక్టివ్ కేసులు ఉండగా.. 76,614 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు ఇప్పటివరకు 1407 మంది వైరస్ కారణంగా మరణించారు.