ఓవైసీ విఙ్ఞప్తి బేఖాతరు.. పలువురిపై పోలీసు కేసులు

కరోనా ప్రభావం పెరిగిపోతున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు వద్దంటూ ప్రభుత్వం, మత పెద్దలు సూచిస్తున్నా కొన్ని ముస్లిం వర్గాలు పెడచెవిన పెడుతున్నాయి. దాంతో హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గురువారం జగ్నే కీ రాత్ ప్రార్థనలు ఎవరి ఇంటిలో వారు జరుపుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు.

ఓవైసీ విఙ్ఞప్తి బేఖాతరు.. పలువురిపై పోలీసు కేసులు
Follow us

|

Updated on: Apr 09, 2020 | 6:16 PM

కరోనా ప్రభావం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో ముస్లింలు గురువారం రాత్రి జరుపుకోవాల్సిన జగ్నే కీ రాత్ (షబ్ ఎ బరాత్) ప్రార్థనలు సామూహికంగా జరపవద్దని ముస్లిం వర్గాలకు మత పెద్దలు పిలుపునిచ్చారు. సామూహికంగా ప్రార్థనలు జరిపితే కరోనా వ్యాప్తిని నియంత్రించలేమన్న అంశాన్ని ప్రతీ ఒక్క ముస్లిం గుర్తించాలని, తమ తమ ఇళ్ళలోనే జగ్నే కీ రాత్ (షబ్ ఎ బరాత్) ప్రార్థనలు నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలు తమ మత ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నారు.

మసీదులలో షబ్ ఎ బరాత్ ప్రార్థనలు జరపరాదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను సహకరించాలని ఆయన కోరారు. సామాజిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. గురువారం సాయంత్రం జరిగే షబ్ ఎ బరాత్ (జగ్నే కీ రాత్) జరుపుకోవడంలో ముస్లింలందరూ లాక్ డౌన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు సీనియర్ ఓవైసీ. సామూహిక ప్రార్థనలు అలాగే మసీదుకు వెళ్ళకూడదని, తెలుగు రాష్ట్రాలకు చెందిన మత పెద్దలతో పాటు ఓవైసీ బ్రదర్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తబ్లిఘీ జమాత్ వర్కర్స్ వల్ల పెరిగిపోయిన కరోనా కేసుల నియంత్రణకు ముస్లింలు సహకరించాలని వారు కోరుతున్నారు.

మరోవైపు సామూహిక ప్రార్థనలు వద్దని ముస్లిం మత పెద్దలు సూచిస్తుంటే… వాటిని బేఖాతరు చేసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో గురువారం మధ్యాహ్నం సామూహికంగా ప్రార్థనలు చేసిన పలువురు ముస్లిం యువకులపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు.