తెరమీదికి వర్చువల్ పార్లమెంటు ప్రతిపాదన

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో తక్షణం పార్లమెంటును సమావేశ పరచాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కేంద్రాన్ని కోరింది. అయితే...

  • Rajesh Sharma
  • Publish Date - 6:19 pm, Sat, 30 May 20
తెరమీదికి వర్చువల్ పార్లమెంటు ప్రతిపాదన

కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో తక్షణం పార్లమెంటును సమావేశ పరచాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కేంద్రాన్ని కోరింది. అయితే, పార్లమెంటు సభ్యులు ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేనందున వర్చువల్ పద్దతిలో పార్లమెంటును సమావేశపర్చాలని కాంగ్రెస్ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచిస్తున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా వర్చువల్ విధానంలో పార్లమెంటును సమావేశపర్చాలని వారు అంటున్నారు.

దేశవ్యాప్తంగా అయిదో విడత లాక్ డౌన్ అమల్లోకి రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వం ముందుకు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రపంచంలోని పలు దేశాలు డిజిటల్ విధానంలో కీలకమైన సమావేశాలను నిర్వహిస్తున్నాయని కాంగ్రెస్ నేతలంటున్నారు. చివరికి లండన్ హౌజ్ ఆఫ్ కామన్స్ కూడా డిజిటల్ విధానంలో సమావేశం అయ్యేందుకు రెడీ అవుతోందని వారు గుర్తు చేస్తున్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితిని, లాక్ డౌన్ ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితిని, ప్రభుత్వ వైఫల్యాలను అన్నింటికీ మించి మోదీ ఆరేళ్ళ పాలనపైనా చర్చించాల్సి వుందని కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా,  కేసీ వేణుగోపాల్ శనివారం డిమాండ్ చేశారు.

పార్లమెంటును వర్చువల్ పద్దతిలో నిర్వహించడంతోపాటు పలు పార్లమెంటరీ కమిటీల కార్యకలాపాలను డిజిటల్ విధానంలో పున: ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌ని వినియోగించుకుంటూ ఒక రోజు లోక్‌సభ, మర్నాడు రాజ్యసభను సమావేశ పరిచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సూచిస్తున్నారు.

పలు సూచనలు చేసిన కాంగ్రెస్ నేతలు.. లాక్ డౌన్ పరిస్థితిని మోదీ ప్రభుత్వం పౌర హక్కులను హరించేందుకు, విపక్షాలపై జులుం చేసేందుకు వినియోగించుకుందని ఆరోపిస్తున్నారు. అట్టహాసంగా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పూర్తిగా డొల్లగా మారిందని చెబుతున్నారు. లాక్ డౌన్ అమలు కూడా గందరగోళంగా తయారైందని విమర్శిస్తున్నారు.