ఊరిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవి.. రేవంత్ ఆశలు.. కుంతియా షాకింగ్ కామెంట్..

ఊరిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవి.. రేవంత్ ఆశలు.. కుంతియా షాకింగ్ కామెంట్..

టీపీసీసీ చీఫ్ పదవి పై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఖాయం అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. తాజాగా మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంకేముంది రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఫిక్స్ అయిందని.. అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యమని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 09, 2019 | 5:50 PM

టీపీసీసీ చీఫ్ పదవి పై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఖాయం అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. తాజాగా మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంకేముంది రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఫిక్స్ అయిందని.. అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యమని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ కుంతియా ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. అసలు టీపీసీసీ చీఫ్ పదవి పై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. మరోవైపు ఈ పదవి పై తెలంగాణ నుంచి నలుగురు మంత్రులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి దాదాపు ఖరారు కాగా, పార్టీ సీనియర్ నేతలు చివరి నిమిషంలో అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి అనుచరులు వాపోతున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని పక్కనపెట్టి.. వలస వచ్చిన వారికి పీసీసీ బాధ్యతలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని కొందరు సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో అభిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా వ్యవహరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత పార్టీలోని ఇతర నాయకులతో విభేదాల కారణంగా టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా పార్టీలు మారిన వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం కరెక్టు కాదని.. మొదటి నుంచి పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన వారు ఎంతోమంది ఉన్నారని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల తర్వాతే టీపీసీసీ చీఫ్ మార్పుపై నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి తోడు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మారిస్తే.. ఆ ప్రభావం హుజూర్ ‌నగర్ ఉపఎన్నిక పై పడే అవకాశం ఉందని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి ఆశలకు తాత్కాలికంగా బ్రేక పడినట్లైంది. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా టీపీసీసీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉత్తమ్ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu