AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి కళాశాలలుః మంత్రుల కమిటీ

తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభించడం సాధ్యంకాదని రాష్ట్రమంత్రులు స్పష్టం చేశారు. పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి పాఠశాలలు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల సబ్‌ కమిటీ నిర్ణయించింది.

రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి కళాశాలలుః మంత్రుల కమిటీ
Balaraju Goud
|

Updated on: Oct 08, 2020 | 6:59 AM

Share

తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభించడం సాధ్యంకాదని రాష్ట్రమంత్రులు స్పష్టం చేశారు. పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి పాఠశాలలు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల సబ్‌ కమిటీ నిర్ణయించింది. కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా కేసుల విజృంభణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దసరా, దీపావళీ పండుగల అనంతరం పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు తుది నిర్ణయం వెలువడనుంది.

యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు నవంబర్‌ 1 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. విద్యాసంస్థలు ప్రారంభమైతే విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికపప్పుడు పరిశీలించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. బుధవారం ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌తో కూడిన సబ్‌కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆగిపోకుండా ఉండేందుకు డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సూచించారని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో 96% మందికి టీవీలున్నాయని, 40% మందికి ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్నదని తెలిపారు. 86% మందికి ఆన్‌లైన్‌ విద్య అందుతున్నట్టు సర్వేలో తేలిందని పేర్కొన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరి అవుతుందని, అందరికీ అందేలా చూడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు సగం మందితోనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున మిగతా వారికి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాల్సి ఉంటుందని చెప్పారు.

చదువుతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. సబ్‌ కమిటీ నిర్ణయాలు ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తాయన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో విద్య అందరికీ సమానమేనని, వివిధశాఖల ఆధ్వర్యంలోనడుస్తున్న విద్యాలయాల్లో ఎలాంట బేధాలు లేకుండా విద్యావ్యవస్థ నడిపించాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల విషయంలో నిబంధన ఒకే విధంగా ఉండాలని పేర్కొన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభంలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని తుది అభిప్రాయం వెల్లడిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్లు ఉన్నా సిగ్నల్‌ అందని పరిస్థితి ఉన్నదని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు.