చిరంజీవితో భేటీ వెనుక బీజేపీ భారీ వ్యూహం.. సోము సాఫ్రాన్ ప్లాన్ ఇదే!

చిరంజీవితో భేటీ వెనుక బీజేపీ భారీ వ్యూహం.. సోము సాఫ్రాన్ ప్లాన్ ఇదే!

ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ నాలుగేళ్ళలో ఏకంగా మెజారిటీ సీట్లను గెలుచుకునే స్థాయికి ఎలా ఎదుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ చర్చ ఒక వైపు కొనసాగుతుండగానే సోము వీర్రాజు ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవిని కల్వడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కి పడ్డాయి...

Rajesh Sharma

|

Aug 08, 2020 | 2:20 PM

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన సోము వీర్రాజు అకస్మాత్తుగా మెగాస్టార్ చిరంజీవిని కల్వడంపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అధ్యక్షునిగా నియమితులయ్యాక ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దల ఆశీస్సులు తీసుకుని వచ్చిన సోము వీర్రాజు.. ఆ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. రకరకాల ఎత్తుగడలతో 2024లో ఏపీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆయన పలు ఇంటర్వ్యూలలో కుండబద్దలు కొట్టారు. 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి అధికార పగ్గాలు చేపడతాయని సోము వీర్రాజు టీవీ9 ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ నాలుగేళ్ళలో ఏకంగా మెజారిటీ సీట్లను గెలుచుకునే స్థాయికి ఎలా ఎదుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ చర్చ ఒక వైపు కొనసాగుతుండగానే సోము వీర్రాజు ఉన్నట్లుండి మెగాస్టార్ చిరంజీవిని కల్వడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా కల్వక ముందే చిరంజీవితో సోము వీర్రాజు భేటీ అవడంతో ఆయన వ్యూహం ఏంటా అన్న చర్చ మొదలైంది.

ఈ క్రమంలో పలు ఊహాగానాలు తెరమీదికి వస్తున్నాయి. ఏపీలో సామాజిక వర్గాల అధారంగానే రాజకీయ ఆధిపత్యం దక్కుతుందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా అందరూ భావిస్తున్న బలమైన సామాజిక వర్గం కాపులకు అధ్యక్ష పదవి కట్టబెట్టిందని విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం కన్నా లక్ష్మీ నారాయణకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం వెనుక ఉద్దేశం అదే అయినా.. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలను పార్టీలోకి లాగ లేకపోయారన్నది బీజేపీ అధినేతల అభిప్రాయమని తెలుస్తోంది.

అందుకే ప్రస్తుతం కాపు సామాజిక వర్గాన్ని ఒక్కతాటి మీదికి తెచ్చి బీజేపీని ఏపీలో బలమైన శక్తిగా మార్చడంతోపాటు.. జనసేన పార్టీతో కలిసి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టేలా వ్యూహరచన చేయడంలో భాగంగానే సోము వీర్రాజు.. మెగాస్టార్‌తో భేటీ అయినట్లుగా చెబుతున్నారు. అయితే చిరంజీవి ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరడం లేదని కూడా బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. కానీ దానికో థియరీ చెబుతున్నారు.

ముందుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను బీజేపీలోకి చేర్పించే కార్యాచరణలో చిరంజీవి పరోక్షంగా పాలు పంచుకుంటారని, 2024 ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే అప్పుడాయన జనసేన పార్టీలో చేరుతారా? లేక గతంలో జాతీయ పార్టీలో వుండి.. కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన స్థాయి కాబట్టి బీజేపీలో చేరతారా? అన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదు.

మొత్తానికి చిరంజీవి, సోము వీర్రాజుల భేటీ తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకు తెరలేపింది. సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తెచ్చే కార్యక్రమంలో భాగంగానే సోము వీర్రాజు చిరంజీవిని కలిసినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. చిరంజీవి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు వీరిద్దరి భేటీ తెరలేపింది. చిరంజీవి రంగంలోకి దిగిన తర్వాత బీజేపీ-జనసేన కలిసి నిర్వహించే ఆపరేషన్ సాఫ్రాన్ సక్సెస్ అవుతుందని బీజేపీ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీలో అసంతృప్తిగా వున్న కాపు సామాజిక వర్గం నేతలు బీజేపీలోకి వస్తే వద్దనరు కానీ.. ప్రధానంగా టీడీపీని ఖాళీ చేయించేందుకు కమలం నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా గతంలో మంత్రులుగాను, టీడీపీలో రాష్ట్ర కార్యవర్గంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఆకర్షించేందుకు కమలాకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పల్లంరాజు వంటి కీలక కాంగ్రెస్ నేతలు బీజేపీ అధినేతలతో ఢిల్లీలో టచ్‌లో వున్నట్లు తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu