గాల్వన్ లోయ మాదే… దూకుడు తగ్గని చైనా
లదాఖ్ లోని గాల్వన్ వ్యాలీ అంతా తమదేనని చైనా ప్రకటించుకుంది. ఇండియాతో గల వివాదాస్పద బోర్డర్ సమీపంలోని గాల్వన్ నది నీటిని మళ్ళించడానికి ఆ దేశం బుల్ డోజర్లను, ఇతర సామాగ్రిని

లదాఖ్ లోని గాల్వన్ వ్యాలీ అంతా తమదేనని చైనా ప్రకటించుకుంది. ఇండియాతో గల వివాదాస్పద బోర్డర్ సమీపంలోని గాల్వన్ నది నీటిని మళ్ళించడానికి ఆ దేశం బుల్ డోజర్లను, ఇతర సామాగ్రిని వినియోగిస్తోంది. గత సోమవారం ఈ ప్రాంతంలోనే సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తున భారత, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శాటిలైట్ ఇమేజీలు చూపుతున్న ప్రకారం.. ఈ ప్రాంతం అంతా కొండలు, గుట్టలతో నిండి ఉంది. నియంత్రణ రేఖకు సమీపంలో.. తమ భూభాగంలోనే ఈ లోయ ఉందని, అందువల్ల ఇది తమకే చెందుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు. మే నెల మొదటివారం నుంచే భారత సైనికులు ఇక్కడ చొచ్ఛుకురావడం ఆరంభించారన్నారు. పైగా ఇక్కడ నదిపై వారు బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 15 న మేకులు గుఛ్చిన చెక్క వస్తువులతోను, ఇనుప తీగలు చుట్టిన రాడ్లతోను ఉభయ దేశాల దళాల మధ్య దాడులు జరిగాయి. ఆ దాడుల్లో 20 మంది భారత సైనికులు మృతి చెందగా.. చైనా సైనికులు 45 మంది మరణించినట్టు వార్తలందాయి. అయితే తమవాళ్లు ముప్పయ్ మంది మృతి చెందినట్టు చైనా పేర్కొంది. కాగా 10 మంది భారత సైనికులను తాము బందీలుగా పట్టుకున్న విషయం తనకు తెలియదని ఝావో లిజియాన్ అన్నారు. (వారిని చైనా విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి.)
లదాఖ్ లో పాంగాంగ్ సరస్సు నియంత్రణ రేఖకు 2,100 మైళ్ళ పొడవునా ఉంది. 1962 లో ఈ ప్రాంతం వద్దే భారత, చైనా సైనికుల మధ్య యుధ్ధం జరిగింది. ఇలా ఉండగా గత పది రోజులుగా చైనా దళాలు హిమాలయ పర్వత శ్రేణుల వద్ద కొన్ని యంత్రాలను తరలించి.కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆ దేశం అక్రమంగా రోడ్డు నిర్మిస్తోందని భారత సైన్యం ఆరోపిస్తోంది.