బంగాళాఖాతంలో అట్టహాసంగా “మలబార్ 2020” విన్యాసాలు

సరిహద్దు దేశాలతో ఎప్పడు కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. బంగాళఖాతంలో భారీ మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

బంగాళాఖాతంలో అట్టహాసంగా మలబార్ 2020 విన్యాసాలు
Follow us

|

Updated on: Nov 03, 2020 | 8:09 PM

సరిహద్దు దేశాలతో ఎప్పడు కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. బంగాళఖాతంలో భారీ మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనాను దీటుగా ఎదుర్కొంటామని చాటి చెప్పాయి. మంగళవారం ప్రారంభమైన తొలి దశ విన్యాసాలు ఈ నెల 6 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మలబార్‌ యుద్ధక్రీడల విన్యాసాలను ట్వీట్ చేసింది. ఈ విన్యాసాల్లో భారత్‌తోపాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నేవీ ఫోర్స్ పాల్గొంటున్నాయి. కాగా, ఆస్ట్రేలియా తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటోంది. మరోవైపు ఆస్ట్రేలియా హాజరు కావడంపై దాని మిత్రదేశమైన చైనా నిప్పులు చెరుగుతోంది.

బంగాళాఖాతంలో నాలుగు దేశాలకు చెందిన నావికా దళాలు మంగళవారం నుంచి మెగా మలబార్ నావల్ ఎక్సర్‌సైజెస్‌ను ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక, ఆర్ధిక పరిధిని సమతుల్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విన్యాసాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. పసిఫిక్ రీజియన్‌లో చైనాకు చెక్ పెట్టేందుకు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఈ నాలుగు దేశాల నావికా దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం పదమూడేళ్ళలో ఇదే తొలిసారి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఈ నెల 6 వరకు తొలి దశ విన్యాసాలు జరుగుతాయి.

ఇండో పసిఫిక్‌లోని నాలుగు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అనధికారిక సమూహమైన క్వాడ్‌లోని సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది మలబార్‌ విన్యాసాల్లో ఆస్ట్రేలియాను చేర్చడానికి అమెరికా, జపాన్‌తో భారత్‌ చర్చించి నిర్ణయించింది. యూఎస్ నేవీకి చెందిన జాన్ ఎస్ మెక్కెయిన్ క్షిపణి డిస్ట్రాయర్, ఆస్ట్రేలియా బల్లారట్ ఫ్రిగేట్, జపాన్ డిస్ట్రాయర్లు, జలాంతర్గామితో పాటు భారత నావికాదళానికి చెందిన ఐదు నౌకలను ఈ విన్యాసాల్లో మోహరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ 6 వరకు కొనసాగనున్న మొదటి దశ కసరత్తుల్లో కొవిడ్‌ 19 పరిమితుల కారణంగా నాలుగు దేశాల సైనిక సిబ్బంది మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఈ నెల చివర్లో భారత్‌, యూఎస్ విమానాలను క్యారియర్‌లలో మోహరించనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

అయితే, మలబార్ విన్యాసాల లక్ష్యం పట్ల చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో తన ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ దేశాలన్నీ చేతులు కలిపినట్లు భావిస్తోంది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఈ విన్యాసాలు దోహదపడతాయని, అందుకు విరుద్ధంగా ఉండబోవని ఆశిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికాపై డ్రాగన్ కంట్రీ విరుచుకుపడింది. ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించింది.