కోవిడ్ 19 వ్యాక్సిన్ ధరపై రాష్ట్రాలతో చర్చిస్తున్నాం, అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ
కోవిడ్ 19 వ్యాక్సిన్ ధరపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ధరపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ని తీసుకునేవారిలో మొదట ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, వృధ్దులు, ప్రాణాంతక వ్యాధులతో బాధ పడుతున్నవారికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన.. కోవిడ్ టీకామందు తయారీకోసం మన శాస్త్రజ్ఞులు ఎంతో కృషి చేస్తున్నారని, ఇది సమర్థంగా పని చేస్తుందన్న విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. చౌక ధరలో లభించే నాణ్యమైన, సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తోందని, ముఖ్యంగా అన్ని దేశాలూ ఇండియావైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున టీకామందును ఉత్పత్తి చేసి దేశ ప్రజలకు అందుబాటులో ఉంచే మౌలిక సదుపాయాల వ్యవస్థ మనకు ఉంది.. దీని పంపిణీ, అడ్మినిస్ట్రేషన్ వంటి విషయాలను పర్యవేక్షించే బాధ్యతను నిపుణుల బృందానికి అప్పగించాం..వారి నుంచి సలహాలను, సూచనలను స్వీకరిస్తున్నాం అని మోదీ తెలిపారు.
కాగా.. మొత్తం సుమారు 12 పార్టీల నాయకులు ఈ అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, ఎన్సీపీ తరఫున శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.