BiggBoss5: కింగ్ నాగ్ బిగ్‌బాస్ జోష్.. సీరియల్ ప్రోమోల హోరుతో ప్రేక్షకుల బేజార్..
పంటి కింద రాయి పడితే ఎలా ఉంటుందో తెలుసు కదా.. అదే మంచి వినోదం కోసం చూస్తుంటే అడ్డుగోలుగా యాడ్ లు వస్తే అలానే ఉంటుంది ఏమంటారు?
BiggBoss5: పంటి కింద రాయి పడితే ఎలా ఉంటుందో తెలుసు కదా.. అదే మంచి వినోదం కోసం చూస్తుంటే అడ్డుగోలుగా యాడ్ లు వస్తే అలానే ఉంటుంది ఏమంటారు? మామూలుగానే మన టీవీ చానెళ్ళు చూపించే సీరియల్ కొంత అందులో వేసే ప్రకటనలు భరించలేనంత. అయినా సరే.. ఎదో వినోదం కోసం.. కాలక్షేపం కోసం తప్పనిసరి అయి ఆ సీరియళ్ళ బాధ తో పాటూ ఈ యాడ్ ల రొదను కూడా భరిస్తున్నారు ప్రేక్షకులు. మరి అదేలోకువగా తీసుకున్నట్టున్నారు డిస్నీ హాట్ స్టార్ యాప్ నిర్వాహకులు. మామూలుగా ఏదైనా రియాల్టీ షో వస్తే.. అందులో కొద్దిగా యాడ్ లు ఉండడం సహజం. అవి తప్పవు కూడా. కానీ సంచలన బిగ్‌బాస్ షో.. అదీ ప్రారంభ వేడుక ప్రసారం చేసే సమయంలో డిస్నీ హాట్ స్టార్ చూసిన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి ఈ ప్రకటనలు.
అసలే ఆదివారం.. అందులోనూ బిగ్‌బాస్ .. అదీ కింగ్ నాగ్ నడిపించే ప్రారంభ కార్యక్రమం.. ఇంకేముంది.. ఆదివారం రియాల్టీ షో ప్రేమికులు అందరూ డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడాలని సిద్ధం అయిపోయారు. ఇక కార్యక్రమం ప్రారంభం అయింది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ అదిరింది. మెల్లగా ప్రేక్షకులు కార్యక్రమంలో లీనమవుతున్నారు. అంతే.. ఒక్కసారిగా గాలి తీసేశారు. ఒకటి కాదు రెండు కాదు డజను ప్రకటనలు ఒకదాని వెంట ఒకటి.. ప్రేక్షకుడికి అలుపు వచ్చేలా.. వస్తూనే ఉన్నాయి. ఎదోలే అని మొదటిసారి పట్టించుకోకుండా మళ్ళీ బిగ్‌బాస్ ఫ్లేవర్ ఆస్వాదిద్దామని అనుకునేలోపు.. అంటే నాగార్జున హౌస్ చూపించడం మొదలు పెట్టిన కొద్ది సేపటిలో మళ్ళీ అదే మోత.. ఇలా కార్యక్రమంలో ప్రతి పది నిమిషాలకు ఓ సారి రెండు నిమిషాల పాటు యాడ్ ల దరువు వేసేశారు. దీంతో బిగ్‌బాస్ కలర్ ఫుల్ ప్రోగ్రాం కాస్తా ఈ ప్రకటనల దెబ్బకు ప్రేక్షకులకు బ్లాక్ అండ్ వైట్ పీడకలను చూపించింది.
అదేమిటండీ.. అంత ఖర్చుపెట్టి ప్రోగ్రాం ఇస్తున్నారు..ఎదో నాలుగు యాడ్ లు వేసుకుంటే మీకేంటండీ అంత నొప్పి.. అని ఎవరైనా అడిగొచ్చు. అది కూడా తప్పుకాదు సుమండీ. కానీ, ఈ డిస్నీ హాట్ స్టార్ చూపించిన యాడ్ లతో ఒక్కరూపాయి కూడా ఆదాయం వారికీ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటారా? ఇవన్నీ ఇదే ఓటీటీ ఛానెల్ స్టార్ మా సీరియళ్ళ ప్రకటనలు. పేర్లు చెప్పడానికి కూడా ఓపిక మిగలనంతగా ఈ సీరియల్ ప్రోమొలను దంచేశారు. ఇక్కడ ఇంకో తమాషా ఏమిటంటే.. ఒక సీరియల్ ప్రోమోలు వరుసగా తిప్పి తిప్పి ఆరేడు సార్లు వేయడం. మరి దీనిని ఏమనాలో కూడా అర్ధం కావడం లేదని బిగ్‌బాస్ ప్రేమికులు తలలు బాదుకున్నారు. బిగ్‌బాస్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ మొత్తం ఐదు గంటల పాటు ప్రసారం చేసింది డిస్నీ హాట్ స్టార్ ప్లస్.. నిజానికి ఇదే కార్యక్రమం మొత్తం నిడివి నాలుగు గంటల లోపే. అంటే దాదాపు గంట పాటు ఈ సీరియల్ ప్రకటనల హోరు బిట్లు బిట్లుగా ప్రేక్షకుల సహనాన్ని పీల్చి పిప్పి చేశాయన్నమాట. ఇదే కనుక కొనసాగితే.. బిగ్‌బాస్ ఇమేజి డ్యామేజి కావడం ఖాయం అని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ విషయం నిర్వాహకులకు ఎవరు ఎలా చెబుతారో కదా!
Bigg Boss 5: ‘అరే ఏంట్రా ఇది’.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌లే టార్గెట్.!