Bhishma Niti: రాజు ఎవరినీ నమ్మకూడదు.. హద్దులు దాటి చనువుగా ఉండకూడదంటూ.. భీష్ముడు చెప్పిన చిలుక కథ

Bhishma Niti: రాజు ఎవరినీ నమ్మకూడదు.. హద్దులు దాటి చనువుగా ఉండకూడదంటూ.. భీష్ముడు చెప్పిన చిలుక కథ
Bhishmudu

Mhabaharata-Bhishma Niti: మహాభారతం పంచమవేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచిచెడుల గురించి , మనిషి నడవడి ఎలా ఉండాలి తెలియజేస్తూ.. మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియచేస్తుంది..

Surya Kala

|

Sep 24, 2021 | 8:12 AM

Mhabaharata-Bhishma Niti: మహాభారతం పంచమవేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచిచెడుల గురించి , మనిషి నడవడి ఎలా ఉండాలి తెలియజేస్తూ.. మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియచేస్తుంది. ముఖ్యంగా మహాభారతంలో అత్యంత శక్తివంతమైన, ప్రధానమైన వ్యక్తి భీష్ముడు.. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి.. అంపశయ్యమీద ఉన్న భీష్ముడు.. ధర్మరాజుకి . మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథలతో తెలిపారు. ధర్మరాజుకి రకరకాల ఉపదేశాలు చేశాడు. లౌక్యం గురించీ, రాజ్యపాలన గురించీ చేసిన ఈ ఉపదేశాలు… కాలం మారినా విలువని మాత్రం కోల్పోలేదు. రాజు ధర్మం.. రాజనీతి , పాలన గురించి చేసిన హితభోధల్లో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో స్నేహపు పరిమితుల గురించీ, పగ వలన పొంచి ఉండే ప్రమాదం గురించీ చెప్పిన ఓ చిలుక కథ మనకి జీవితపు విలువైన పాఠాన్ని నేర్పుతుంది.

‘‘ధర్మారాజా! అనగనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు.. అంటూ తన కథని మొదలుపెట్టాడు భీష్ముడు..  ఆ బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కాస్తా స్నేహంగా పరిణమించింది. చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. ఇలా కాలం సాగుతుండగా ఆ చిలుకకి ఒక కుమారుడు కలిగాడు. ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుని కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు.  ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చింది. అంతే..  అమాంతం దానిని చిదిమివేశాడు. దీంతో ఆ చిట్టి చిలుక ప్రాణాలు కోల్పోయింది. అది చూసిన తల్లి చిలుక కోపాన్ని అణచుకోలేకపోయింది. వెంటనే తన వాడి గోళ్లతో రాజకుమారుడి కళ్లని పొడిచింది. దీంతో రాజకుమారుడు గుడ్డివాడు అయిపోయాడు.

చిలుక అంతటితో ఆగలేదు. నేరుగా రాజు దగ్గరకు వెళ్లి.. ‘రాజా! నీ కుమారుడు నా కొడుకుని చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతణ్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇకమీదట నేను ఇక్కడ ఉండలేను. సెలవు!’ అని చెప్పింది. అప్పుడు చిలుకతో రాజు .. నువ్వన్నది నిజమే.  జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..?  జరిగినదేదో జరిగిపోయింది. దయచేసి ఇకమీదట కూడా నాతో స్నేహంగా ఉండు,’ అంటూ అర్థించాడు.

దీంతో చిలుక ‘రాజా! నేను నీ కుమారుడిని అంధుడిని చేశాను.. కనుక నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని చేజిక్కించుకోవడం వల్ల, అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాల వల్ల, ఆడవారి మధ్య మాటామాటా పెరగడం వల్ల, ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ ప్రబలుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే..  ఇక వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. అందుకనే నీ తీయని మాటలని విని నేను ఇక్కడ ఉండలేను.. అంటూ చిలుక తుర్రుమంది

ఓ ధర్మరాజా..  రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. తన రాజ్యంలో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా, రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు. అంతేకాదు.. పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ… ఈ మూడింటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవు’’ అంటూ ముగించాడు భీష్ముడు.

Also Read: Battle of Haifa: మెషిన్‌గన్‌‌లు కూడా అడ్డుకోలేని భారతీయ అశ్వదళపుదాడి.. ఆనాటి మన యుద్ధనైపుణ్యం గుర్తు ‘హైఫా యుద్ధం’..ఇజ్రాయిల్‌లో పాఠ్యంశం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu