AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భీమవరంలో మిస్టరీ చోరీలు.. పక్క ఫ్లాట్‌లో ఉంటూ బంగారం, వెండి దోచేసిన వ్యక్తి!

భీమవరం నర్సయ్య అగ్రహారంలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో ఏడు ఫ్లాట్లలో వరుస చోరీలు కలకలం రేపాయి. తాళాలు పగలగొట్టకుండానే బంగారం, వెండి, నగదు మాయమవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహ్మద్ బాషా నకిలీ తాళాలతో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.

భీమవరంలో మిస్టరీ చోరీలు.. పక్క ఫ్లాట్‌లో ఉంటూ బంగారం, వెండి దోచేసిన వ్యక్తి!
Bhimavaram Thefts
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 4:00 PM

Share

వాచ్‌మెన్ ఉన్నాడు.. సీసీ కెమెరాల నిఘా ఉంది.. పటిష్టమైన గేట్లు ఉన్నాయి.. అయినా అపార్ట్‌మెంట్‌లోని ఇళ్ల నుంచి బంగారం, వెండి, నగదు మాయమవుతున్నాయి. తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు.. బీరువాలు యథావిధిగా ఉన్నాయి.. కానీ లోపల దాచిన విలువైన వస్తువులు మాత్రం కనిపించకుండా పోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకున్న వరుస చోరీలు స్థానికంగా కలకలం రేపాయి. చివరకు ఈ మిస్టరీ దొంగతనాల వెనుక అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వ్యక్తి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఏడు ఫ్లాట్లలో వరుస చోరీలు

భీమవరం నర్సయ్య అగ్రహారంలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో గత కొంతకాలంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినవారు తిరిగి వచ్చేసరికి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు కనిపించకుండా పోతున్నాయి. అయితే, తలుపుల తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో బాధితులు అయోమయానికి గురయ్యారు. ఒకటి, రెండు ఇళ్లలోనే కాకుండా.. ఏకంగా ఏడు ఫ్లాట్లలో ఇలాంటి చోరీలు జరగడంతో బాధితులంతా ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్నేహంగా ఉంటూనే చోరీలు!

పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహ్మద్ బాషాపై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

బాషా తోటి ఫ్లాట్‌ నివాసితులతో స్నేహంగా ఉంటూ, వారి రాకపోకలను గమనించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఎవరెప్పుడు ఇంట్లో ఉండరు? ఏ సమయంలో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్తారు? అనే విషయాలను తెలుసుకునేవాడని గుర్తించారు. అనంతరం ఇళ్ల తాళాలు, బీరువాల తాళాలకు నకిలీ తాళాలు తయారు చేయించి, ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి, నగదును దొంగిలించేవాడని పోలీసులు పేర్కొన్నారు. చోరీ చేసిన తర్వాత మళ్లీ తలుపులకు తాళాలు వేయడంతో బాధితులకు మొదట్లో ఎలాంటి అనుమానం రాలేదని తెలుస్తోంది.

కోటి రూపాయలకు పైగా విలువైన సొత్తు స్వాధీనం

ఈ కేసులో మహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 800 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి, రూ.50 వేల నగదు ఉన్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.1.08 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేసినట్లు సమాచారం.

ఇంటి తాళాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ఇరుగుపొరుగు వారితో స్నేహంగా ఉండటం మంచిదే. అయితే, ఇంటి తాళాలు, బీరువాల తాళాలు ఇతరుల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంచుతున్నారనే విషయాన్ని అందరితో పంచుకోకూడదు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. భద్రత కోసం సీసీ కెమెరాలు, వాచ్‌మెన్ ఉన్నప్పటికీ వ్యక్తిగత అప్రమత్తత కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Follow Us