AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్..! ఫలించిన రేవంత్ రెడ్డి దౌత్యం.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపునకు ఫడ్నవీస్ సానుకూలం!

తెలంగాణలో తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలతో పాటు ముంపు ప్రభావంపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేశారు.

గుడ్‌న్యూస్..! ఫలించిన రేవంత్ రెడ్డి దౌత్యం.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపునకు ఫడ్నవీస్ సానుకూలం!
Devendra Fadnavis, Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Oct 26, 2026 | 4:00 PM

Share

తెలంగాణలో తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలతో పాటు ముంపు ప్రభావంపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు.

152 మీటర్ల ఎత్తుపై తెలంగాణ ప్రతిపాదన

ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. 2016లో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఆ ఎత్తుతో తెలంగాణ తాగునీరు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం కష్టమని వివరించారు. అందువల్ల 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టడం ప్రయోజనకరమని ప్రతిపాదించారు. విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాజెక్టు కీలకం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సాగు, తాగునీటి సదుపాయాల కొరతతో ఆ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని ప్రస్తావిస్తూ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని కోరారు. అలాగే ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ రవాణా, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం నీటిపారుదల ప్రాజెక్టు మాత్రమే కాకుండా, రెండు రాష్ట్రాల అభివృద్ధికి వారధిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ముంపు భూములకు పరిహారం చెల్లిస్తాం

బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రతిపాదనపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మహారాష్ట్ర ప్రజలకు ప్రతికూల ప్రభావం ఉండకూడదని పేర్కొన్నారు. అవసరమైన సాంకేతిక అధ్యయనాలు, ముంపు అంచనాలు పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

అధికారుల కమిటీతో తదుపరి కార్యాచరణ

రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, పరిహారం, సాంకేతిక అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కూడా పరిశీలించాలని సూచించారు.

మొత్తంగా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి సిద్ధపడటం తెలంగాణకు కీలక పరిణామంగా భావించవచ్చు. అయితే, 152 మీటర్ల ఎత్తుకు తుది ఆమోదం లభించినట్లు ఇప్పుడే చెప్పలేం. అధికారుల అధ్యయనం, తదుపరి చర్చలు, రెండు రాష్ట్రాల అంగీకారం తర్వాతే ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us