AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చామంతి పూలతో లాభాల బాట.. ఈ రైతు టెక్నిక్ ఏంటో తెలుసా..?

సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. అనంతపురం జిల్లా రైతు రఫీ చామంతి పూల సాగుతో విజయం సాధిస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యూహాత్మక సాగు, సరైన యాజమాన్యంతో అధిక దిగుబడులు, లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

చామంతి పూలతో లాభాల బాట.. ఈ రైతు టెక్నిక్ ఏంటో తెలుసా..?
Flower Farming
Ram Naramaneni
|

Updated on: Oct 26, 2026 | 1:26 PM

Share

మారుతున్న కాలానికి అనుగుణంగా, సంప్రదాయ పంటల సాగుతో నష్టాలను చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల వైపు మళ్లుతున్నారు. ఈ కోవలోనే అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ చామంతి పూల సాగులో అనూహ్య విజయం సాధిస్తున్నారు. మార్కెట్ అవసరాలను, పండగల డిమాండ్‌ను అర్థం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. రైతు రఫీ తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని రెండు ఎకరాల చొప్పున మూడు భాగాలుగా విభజించారు. ప్రతి విభాగంలో విడతల వారీగా వివిధ రకాల చామంతి పూలను నాటారు. సాధారణంగా చామంతి సాగును జూన్-జులై నెలల్లో ప్రారంభిస్తారు. దీనివల్ల శీతాకాలంలో, కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్‌లో అధిక దిగుబడులు వస్తాయి. అయితే రఫీ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగల సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుగానే మొక్కలు నాటారు. దీనివల్ల పండగల సమయంలో పూలకు అధిక గిరాకీ, మంచి ధర లభిస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన పొలంలో బుల్లెట్ (తెలుపు, పసుపు రకాలు), ఐశ్వర్య, ముస్కిన్ వైట్, పేపర్ ఎల్లో, పేపర్ వైట్, పూర్ణిమా ఎల్లో, పూర్ణిమా వైట్ వంటి వివిధ రకాల చామంతులు సాగవుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుండి ఒక్కో మొక్కను రూ. 1.50 చొప్పున కొనుగోలు చేసి, రవాణా, నాటడానికి కలిపి రూ. 2 ఖర్చు అయ్యిందని రఫీ తెలిపారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూలీలను పెట్టి మొక్కలను నాటించారు. మొక్కకు మొక్కకు మధ్య ఒక అడుగు దూరం ఉండేలా జాగ్రత్త పడ్డారు. మొక్కలు నాటిన ఐదు నెలలకు దిగుబడి ప్రారంభమవుతుంది. సాగులో భాగంగా ఎరువులు, పురుగుమందుల వాడకంలో రఫీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొదట డీఏపీ, ఆ తర్వాత ట్రిపుల్ 8, ట్రిపుల్ 28 వంటి ఎరువులను ఉపయోగిస్తారు. డ్రిప్ ద్వారా 13-45-13, 12-0-61 వంటి వాటిని అందిస్తూ, మధ్యమధ్యలో న్యూట్రియెంట్స్, ఫార్ములా 6, హ్యూమిక్ పౌడర్ వంటి వాటిని కూడా వాడుతున్నారు. చామంతి పూలకు సాధారణంగా మొగ్గ వచ్చే వరకు తెగుళ్లు పెద్దగా రావు, కానీ మొగ్గ వచ్చిన తర్వాత పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందని, వాటి నివారణకు అవసరమైన మందులను వాడుతున్నామని రఫీ వివరించారు.

చామంతి పూల కోత సుమారు రెండు నెలల పాటు నిరంతరం కొనసాగుతుంది, ఆ తర్వాత మూడో నెలలో దిగుబడి కాస్త తగ్గుతుంది. మొదటి కోతలోనే రెండు ఎకరాల నుంచి ఒక టన్ను పూలు వచ్చాయని, కిలో రూ. 200 చొప్పున రూ. 2 లక్షల ఆదాయం వచ్చిందని రఫీ తెలిపారు. మొత్తం పెట్టుబడి మొక్కలు నాటినప్పటి నుంచి రూ. 2.25 లక్షలు అయ్యిందని, మొదటి కోతతో పెట్టుబడి వెనక్కి వచ్చి, రెండో కోత నుంచి లాభాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ విషయానికొస్తే, ఉదయం కోసిన పూలను అనంతపురం మార్కెట్‌కు, సాయంత్రం కోసిన పూలను బెంగళూరు, చెన్నై, మైసూరు వంటి పెద్ద నగరాలకు పంపిస్తారు. వ్యాపారులు స్వయంగా పొలానికి వచ్చి పూలను కొనుగోలు చేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. నాణ్యత ఆధారంగా ధరలు మారుతాయని, మొదటి నాణ్యత పూలకు రూ. 275, రెండో నాణ్యతకు రూ. 150, మూడో నాణ్యతకు రూ. 100 వరకు ధర లభిస్తుందని వివరించారు. ఏ పంట అయినా సరే, నాణ్యత ఉంటేనే లాభాలు వస్తాయని, లేకపోతే పంట వ్యర్థమని రఫీ స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడూ ఒకే పంట వేయకుండా, వినూత్నంగా ఆలోచిస్తూ, మార్కెట్‌కు అనుగుణంగా పంటలను ఎంచుకుంటే లాభాలు వాటంతట అవే వస్తాయని రైతు రఫీ తన అనుభవంతో నిరూపిస్తున్నారు.

Follow Us