ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్ ముప్పు..! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ వ్యవస్థ సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య ఉత్తర ఆంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీవ్ర వాయుగుండంగా ఏర్పడితే.. దీనికి ‘ఆర్నాబ్’ తుఫాన్ గా నామకరణం చేయనున్నారు. తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం తుఫానుగా బలపడిందని, రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండం బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఇది దాటే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
తీరం వెంబడి బలమైన గాలులు
వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. రానున్న 4రోజుల భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండి, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక తెలిపింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
