భూమి లేకుండానే వ్యవసాయం? సముద్రంపై తేలే ఈ పొలం వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా మంచినీటి వనరులు తగ్గుతున్న వేళ వ్యవసాయానికి నీటి కొరత పెద్ద సవాలుగా మారుతోంది. ఈ సమస్యకు శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాన్ని చూపించారు. సముద్రపు ఉప్పు నీటిని సూర్యరశ్మితో స్వచ్ఛమైన నీటిగా మార్చి, అదే నీటితో సముద్రంపై తేలియాడే పొలంలో కూరగాయలు పండించారు. ఈ ప్రయోగం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దారిని చూపిస్తోంది.

భూమి లేకపోయినా వ్యవసాయం చేయగలిగితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనకు రూపమే ఫ్లోటింగ్ ఫార్మ్. ఆస్ట్రేలియాలోని University of South Australia పరిశోధకులు సముద్రపు నీటిని శుద్ధి చేసి మొక్కలకు అందించే ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. సూర్యరశ్మినే ప్రధాన వనరుగా ఉపయోగిస్తూ పంటలకు అవసరమైన నీటిని అందించడం దీని ప్రత్యేకతగా నిలిచింది.
రెండు అంచెల్లో సాగు.. నీటి శుద్ధి
ఈ వ్యవస్థను Double Layered Vertical Solar Sea Farm (DVSSF)గా పిలుస్తున్నారు. ఇందులో రెండు అంచెలు ఉంటాయి. కింది భాగంలో సముద్రపు ఉప్పు నీటిని ఆవిరిగా మార్చి, తిరిగి మంచినీటిగా తయారు చేస్తారు. పై భాగంలో మట్టిని ఉంచి మొక్కలను పెంచుతారు. నీటిపై తేలేందుకు పాలిస్టైరీన్ ఫోమ్‌ను ఉపయోగించారు.
కింది భాగంలో సూర్యరశ్మి వేడి వల్ల ఉప్పు నీరు ఆవిరవుతుంది. ఆ ఆవిరి చల్లబడి స్వచ్ఛమైన నీరుగా మారుతుంది. ఈ నీటిని పైభాగంలోని మట్టికి చేరవేసేందుకు నీటిని పీల్చుకునే బంబూ పేపర్ బెల్టులను అమర్చారు. దీంతో మొక్కలకు సముద్రపు ఉప్పు నీరు నేరుగా చేరదు.
బ్రోకోలీ నుంచి పాక్ చోయ్ వరకు..
మొదటి ప్రయోగాల్లో బ్రోకోలీ, లెట్యూస్, పాక్ చోయ్ వంటి కూరగాయలను పండించారు. కృత్రిమ సముద్రపు నీటితో నింపిన కొలనులో చేసిన పరీక్షల్లో మూడు రకాల విత్తనాలు 80 శాతానికి పైగా మొలకెత్తాయి. పైభాగంలో పారదర్శక మూత ఉండటంతో ఎండ తీవ్రత ఉన్నా లోపలి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంది.
నీటి ఆవిరి వేగంగా ఏర్పడేందుకు ప్రత్యేక సౌర పదార్థాన్ని కూడా ఉపయోగించారు. Reduced Graphene Oxide, Tannic Acid, Cotton Substrateతో తయారు చేసిన ఈ పదార్థం సూర్యరశ్మిని గ్రహించి వేడిగా మార్చుతుంది. దీంతో మట్టిలో తేమ సుమారు 20% వరకు నిలిచింది.
సముద్రాలు, ఉప్పునీటి సరస్సులపై వ్యవసాయం చేయడానికి ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పెద్ద మొక్కలు పెరిగినప్పుడు కింది భాగానికి సూర్యరశ్మి తగ్గడం సమస్యగా మారొచ్చు. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయిలో వ్యవసాయం చేసేందుకు ఈ సాంకేతికతను అభివృద్ధి చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.
