Parivartini Ekadashi: పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట!
Parivartini Ekadashi Puja Rituals Telugu: సెప్టెంబర్ 22న వచ్చే పరివర్తని ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు పొంది, కోరికలు నెరవేర్చుకోవచ్చు. ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల దారిద్య్రం తొలగి, ఆర్థిక సమస్యలు తీరి, సకల శుభాలు కలుగుతాయి. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన నియమాలను తెలుసుకోండి.

Parivartini Ekadashi Puja Rituals Telugu: సెప్టెంబర్ 22, 2026, మంగళవారం నాడు వచ్చే పరివర్తని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన రోజు. శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఒకవైపు నుంచి మరొక వైపునకు కదిలే శుభసందర్భం ఇది. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు, పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
పూజా విధానం, పాటించాల్సిన నియమాలు
1. పవిత్ర స్నానం: ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి, తలస్నానం చేయాలి. నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోతుందని నమ్మకం.
2. అలంకరణ: పూజా గదిలోని విష్ణుమూర్తి పటానికి గంధం బొట్లు పెట్టి, కుంకుమ ధరించాలి. పసుపు రంగు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించి, తులసి మాల వేసి పూజ చేయాలి. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. మంగళవారం తులసి ఆకులు తెంపకూడదు కాబట్టి, ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి.
3. లక్ష్మీదేవి పూజ: విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. స్త్రీలు తప్పకుండా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి.
4. నైవేద్యాలు: స్వామివారికి వడపప్పు, పానకం, అరటి పండ్లు, అటుకులు, పటిక బెల్లం వంటివి నైవేద్యంగా సమర్పించాలి.
5. మంత్ర జపం: విష్ణు సహస్రనామం జపించడం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. లక్ష్మీనారాయణుల ముందు రెండు దీపాలు వెలిగించి పూజ చేయాలి.
6. అభిషేకం: పూజా గదిలో విష్ణుమూర్తి విగ్రహం లేదా శ్రీకృష్ణుని విగ్రహం ఉంటే, పంచామృతాలతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార) అభిషేకం చేయాలి. ఇది కోరిన కోరికలను త్వరగా నెరవేరుస్తుంది.
విశేష పరిహారాలు:
- వివాహం కోసం: వివాహం కాని వారు పసుపు రంగు దారంతో 21 పసుపు కొమ్ములను మాల కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి పూజ చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది.
- ధన వృద్ధి కోసం: త్వరగా ధనవంతులు కావాలనుకునేవారు రావి ఆకుపైన గంధంతో “శ్రీ విష్ణు” అని రాసి, ఆ ఆకును పూజా గదిలో పెట్టి పూజిస్తే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి.
- దాంపత్య సామరస్యం: తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది.
- శని దోష నివారణ: ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఏడు ప్రదక్షిణాలు చేయాలి. దీనివల్ల శని బాధలు తొలగిపోతాయి. రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే అదృష్టం కూడా వరిస్తుంది.
- గోమాత సేవ: ఈ రోజున గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలు, బెల్లం, అరటిపండు తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది.
- గృహ శాంతి: ఇంటి ముందు బియ్యప్పిండితో ముగ్గు వేసి, ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. దీనివల్ల నరపీడ తొలగిపోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
- అదృష్టం కోసం: పసుపులో చిటికెడు గంధం పొడి కలిపి నుదుటిపైన బొట్టుగా ధరిస్తే జాతకంలో అదృష్టం పెరుగుతుంది.
- ఆర్థిక స్థిరత్వం: ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులను మూటకట్టి బీరువాలో పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది.
- సాయంత్రం పూజ: ఏకాదశి సాయంత్రం కూడా స్త్రీలు స్నానం చేసి పూజా గదిలో దీపం పెట్టాలి. ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది.
- దిష్టి నివారణ: ఒక పచ్చి నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీస్తే నరదృష్టి తొలగిపోతుంది.
- అప్పుల బాధలు: అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించి కనకధార స్తోత్రం చదివితే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.
- దానధర్మాలు: పేదలకు పెరుగు దానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. గొడుగు, చెప్పులు దానం చేస్తే వృత్తి, వ్యాపారాలలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.
- విద్యార్థుల కోసం: విద్యార్థులు విద్యాగోపాల మంత్రం చదివితే జ్ఞాపకశక్తి, మేధస్సు పెరుగుతాయి.
- అన్నదానం: ఉపవాసం ఉండి, ఆకలితో ఉన్న పేదలకు అన్నదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
పాటించకూడని నియమాలు:
- అన్నం త్యాగం: పరివర్తని ఏకాదశి రోజున అన్నం అస్సలు తినకూడదు, ఎందుకంటే బియ్యంలో పాప పురుషుడు నివసిస్తాడని నమ్మకం. పాలు, పండ్లు మాత్రమే స్వీకరించాలి.
- పగటి నిద్ర: పగటి పూట నిద్రపోకూడదు, అలా చేస్తే పూజ చేసిన పుణ్యఫలం నశిస్తుంది.
- శరీర శుభ్రత: జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం, తలకు నూనె రాయడం వంటివి చేయకూడదు.
- బ్రహ్మచర్యం: భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి.
- ఆహార నియమాలు: మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తినకూడదు.
- ఈ పరివర్తని ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ శ్రీమహావిష్ణువును పూజిస్తే, ఆయన ఆశీర్వాదం లభించి, కోరిన కోరికలు నెరవేరి, జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి.
(Disclaimer: ఈ కథనంలోని పూజా విధానాలు, పరిహారాలు, ఫలితాలు హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




