AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. చదువులేకున్నా అదరగొట్టిన రైతుబిడ్డ

ఆరో తరగతిలోనే చదువు మానేసి పశువులను కాసిన కమ్మ నాగమల్లేశ్వరరావు.. కష్టాలు, అవమానాలను ఎదుర్కొంటూ డెయిరీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రూ.1,300 జీతంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. రూ.20 లక్షల పెట్టుబడితో ‘రైతన్న డెయిరీ’ స్థాపించే స్థాయికి, నేడు రూ.50 కోట్ల వ్యాపారంగా ఎదిగేలా చేసింది. ముఖ్యంగా సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ‘కుండ పెరుగు’కు భారీ డిమాండ్ రావడంతో వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ యువతకు ఉచిత డెయిరీ శిక్షణ కూడా అందిస్తున్నారు..

‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. చదువులేకున్నా అదరగొట్టిన రైతుబిడ్డ
The Success Story Behind Pot Curd
Srilakshmi C
|

Updated on: Sep 21, 2026 | 7:04 PM

Share

ఒకప్పుడు నెలకు కేవలం రూ.1300 జీతంతో డెయిరీ ఫాంలో ఉద్యోగం చేసిన వ్యక్తి.. ఇప్పుడు రూ.50 కోట్ల విలువైన డెయిరీ వ్యాపారాన్ని నిర్మించారు. ఉద్యోగిగా స్థిరపడిపోవడం కంటే రిస్క్ తీసుకుని సొంతంగా ఎదగాలనే ఆలోచనతో అడుగులు వేసిన కమ్మ నాగమల్లేశ్వరరావు.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ‘కుండ పెరుగు’కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తాను ఎదగడమే కాకుండా గ్రామీణ యువతకు ఉచితంగా డెయిరీ నిర్వహణపై శిక్షణ ఇస్తూ వారికి స్వయం ఉపాధి అవకాశాలను చూపిస్తున్నారు.

ఆరో తరగతిలోనే చదువు మానేసి.. వ్యాపారం

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబం సాధారణ రైతు కుటుంబం. వారి తండ్రికి అరెకరం భూమి మాత్రమే ఉండేది. గ్రామంలో పాలకేంద్రం లేకపోవడంతో చిన్న రైతులు, పిల్లలు తెల్లవారుజామునే పక్క గ్రామానికి వెళ్లి పాలు పోసి వచ్చేవారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో నాగమల్లేశ్వరరావు ఆరో తరగతిలోనే చదువు మానేశారు. గేదెలను కాయడం, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పాలు పోయడం వంటి పనులు చేస్తూ కుటుంబానికి సహాయం చేసేవారు. ఆ సమయంలో ఆయనకు ఎడ్లపాడు గ్రామంలోని పాల కేంద్రంలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం లభించింది. విద్యార్హత కంటే పాల నాణ్యతను గుర్తించడంలో తనకు ఉన్న అనుభవమే ఆ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టిందని ఆయన చెబుతారు.

రూ.1300 జీతంతో ఆరేళ్లు..

పాల కేంద్రంలోని ఫ్యాట్ ల్యాబ్‌లో నెలకు రూ.1,300 జీతంతో ఆరేళ్ల పాటు పనిచేశారు. అక్కడే పాలు సేకరించడం, నాణ్యత పరీక్షించడం, రైతులతో వ్యవహరించడం, మార్కెటింగ్ వంటి డెయిరీ వ్యాపారంలోని అనేక అంశాలను దగ్గరగా నేర్చుకున్నారు. ఒక దశలో కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి రావడంతో జీతం పెంచాలని యజమానిని కోరారు. అయితే జీతం పెంచే పరిస్థితి లేదని, ఇష్టం ఉంటే పని చేయాలని, లేకపోతే వెళ్లిపోవచ్చని యజమాని చెప్పడంతో మరో డెయిరీలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. అక్కడ కూడా పెద్దగా చదువుకోలేదని ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. చివరకు మళ్లీ పాత యజమాని వద్దకే వెళ్లి ఉద్యోగంలో చేరారు. అయితే ఈసారి ఆయన ఆ ఉద్యోగాన్ని కేవలం జీవనోపాధిగా చూడలేదు. భవిష్యత్తులో సొంతంగా డెయిరీ ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రతి అంశాన్ని లోతుగా నేర్చుకోవడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

కొంతకాలానికి డెయిరీ రంగంలో సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలారు. ఓ వ్యక్తి సూచనతో డెయిరీ నిర్వహణలో భాగస్వామిగా అడుగులు వేశారు. కంపెనీ లాభాల బాట పట్టిన తర్వాత ఆ వ్యక్తి తనను మోసం చేశాడని నాగమల్లేశ్వరరావు చెబుతున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. చిలకలూరిపేట సమీపంలోని కావూరులో ఒక డెయిరీ మూతపడుతున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. సొంతంగా డెయిరీ నిర్మించేందుకు అవసరమైన భారీ పెట్టుబడి తన వద్ద లేకపోవడంతో.. డెయిరీని లీజుకు తీసుకుని నిర్వహించాలనే ఆలోచన చేశారు.

రూ.20 లక్షలతో తొలి అడుగు

దాచుకున్న డబ్బు, కూడబెట్టిన వనరులతో సుమారు రూ.20 లక్షల పెట్టుబడితో చిల్లింగ్ సెంటర్ ప్రారంభించారు. రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పెద్ద డెయిరీ బ్రాండ్లకు సరఫరా చేసేవారు. వ్యాపారం నుంచి వచ్చిన లాభాలతో మరికొన్ని మూతపడే స్థితిలో ఉన్న చిల్లింగ్ సెంటర్లను కూడా లీజుకు తీసుకుని నిర్వహించడం ప్రారంభించారు. ఇలా కేవలం నాలుగేళ్లలో 13 చిల్లింగ్ సెంటర్లను నిర్వహించే స్థాయికి ఎదిగారు. అయితే ఇతర కంపెనీలకు పాలు సరఫరా చేయడంతోనే ఆగిపోకుండా, తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలని నిర్ణయించుకున్నారు.

2021లో రైతన్న డెయిరీ

ఈ ఆలోచనతో 2021లో మార్టూరులో ‘రైతన్న డెయిరీ’ని ప్రారంభించారు. మార్కెట్లో ఇప్పటికే అనేక పాల ఉత్పత్తుల బ్రాండ్లు ఉండటంతో వినియోగదారులు తన ఉత్పత్తుల వైపు ఎందుకు రావాలనే ప్రశ్న ఎదురైంది. అప్పుడే సంప్రదాయ పద్ధతిలో తయారయ్యే ‘కుండ పెరుగు’ను ప్రత్యేక ఉత్పత్తిగా మార్కెట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన సులభంగానే ఉన్నా అమలు అంత సులభం కాలేదు. కుండలు తయారు చేసే కుటుంబాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొదట ఒక కుటుంబానికి అడ్వాన్స్ ఇచ్చి కుండలు తయారు చేయించారు. అయితే తగినంత వేగంగా కుండలు అందకపోవడంతో ఆర్డర్లను తీర్చడం కష్టమయ్యేది. సుమారు ఏడాది పాటు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. కుండలకు మంచి ధర చెల్లించడంతో మరిన్ని కుటుంబాలు ఈ పనిలోకి వచ్చాయి. మరోవైపు కుండలో తయారు చేసిన పెరుగు రుచి వినియోగదారులను ఆకట్టుకోవడంతో డిమాండ్ క్రమంగా పెరిగింది.

110 కుటుంబాలకు ఉపాధి.. రూ.50 కోట్ల వ్యాపారం

ప్రస్తుతం కుండ పెరుగు కోసం వివిధ ప్రాంతాల్లోని 110 కుటుంబాలు కుండలను తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. మంగళగిరి, వెలగలేరు, కొలకలూరు, కొల్లూరు, రాజమహేంద్రవరం, వీరవల్లు తదితర ప్రాంతాలకు చెందిన కుటుంబాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కుండల కోసం ఏడాదికి సుమారు రూ.7 కోట్ల విలువైన కుండలను కొనుగోలు చేస్తున్నామని నాగమల్లేశ్వరరావు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు 20 వేల కిలోల వరకు కుండ పెరుగు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలు, వెన్న, పనీర్ తదితర పాల ఉత్పత్తులతో పాటు కుండ పెరుగు సంస్థ వ్యాపారంలో కీలకంగా మారింది. ఒకప్పుడు రూ.1,300 జీతంతో జీవితం ప్రారంభించిన నాగమల్లేశ్వరరావు.. ఇప్పుడు తన డెయిరీ వ్యాపారాన్ని రూ.50 కోట్ల విలువకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇందులో కుండ పెరుగు వాటా గణనీయంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తన విజయాన్ని కేవలం వ్యక్తిగత విజయంగా చూడటం లేదని ఆయన అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువత కూడా తమ కాళ్లపై తాము నిలబడాలని, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

యువత కోసం ‘డెయిరీ స్కూల్’

ఇందుకోసం ‘డెయిరీ స్కూల్’ ఏర్పాటు చేసి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. మూడు నుంచి ఆరు నెలల పాటు జరిగే ఈ శిక్షణలో కుండల తయారీ, కుండ పెరుగు తయారీ, ఇతర పాల ఉత్పత్తుల తయారీ, డెయిరీ నిర్వహణ, మార్కెటింగ్ వంటి అంశాలను నేర్పిస్తున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రూ.7,500 ఉపకార వేతనం అందించడంతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ కళాశాలలు, ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి విభిన్న విద్యా నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు సుమారు 5,000 మంది శిక్షణ పొందగా, వారిలో 500 మంది సొంతంగా డెయిరీలు ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నారని నాగమల్లేశ్వరరావు చెబుతున్నారు.

‘ఆరో తరగతి చదివి.. పీజీ విద్యార్థులకు పాఠాలు’

తాను ఆరో తరగతిలోనే చదువు మానేసినప్పటికీ, ఇప్పుడు పీజీ చదువుతున్న విద్యార్థులకు వ్యాపారం గురించి పాఠాలు చెప్పడం ఎంతో సంతృప్తినిస్తోందని నాగమల్లేశ్వరరావు అంటున్నారు. ‘నేను మాత్రమే ఎదిగితే సరిపోదు. గ్రామాల్లో ఉన్న యువత కూడా తమ కలలను నిజం చేసుకోవాలి’ అనే ఆలోచనతోనే డెయిరీ స్కూల్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. రూ.1300 జీతంతో ప్రారంభమైన ప్రయాణం.. రూ.20 లక్షల పెట్టుబడి.. 13 చిల్లింగ్ సెంటర్లు.. 2021లో సొంత డెయిరీ.. కుండ పెరుగుతో ప్రత్యేక గుర్తింపు.. చివరకు రూ.50 కోట్ల వ్యాపారం. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన ప్రతి సమస్యను ఒక పాఠంగా మార్చుకున్న నాగమల్లేశ్వరరావు కథ.. సంకల్పం, అనుభవం, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే గ్రామీణ నేపథ్యం విజయానికి అడ్డంకి కాదని చెప్పే ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us