Barrelakka Election Result: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెల్సా..?
నిరుద్యోగ యువతిగా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది బర్రెలక్క. ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాజకీయాలంటే ప్రలోభాల పర్వంగా మారిపోయిన తరుణంలో.. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క ప్రజల దృష్టిని ఆకర్షించారు కానీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయలేకపోయారు.
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పేరు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈమె బరిలోకి దిగారు. నిరుద్యోగుల గొంతుకగా ఆమె తనని ప్రొజెక్ట్ చేసుకున్నారు. డబ్బు పంచి ఓట్లు అడగలేను కానీ.. ప్రజాగళం వినిపించగలను అని చెప్పి.. ఓ సామన్య యువతిగా ఎన్నికల రణరంగంలోకి దిగారు. అయితే సోషల్ మీడియాలో బర్రెలకు మంచి సపోర్ట్ వచ్చింది. సామాన్యుల నుంచి పలువురు ప్రముఖుల వరకు ఆమెకు ఆర్థికంగా, మోరల్‌గా అండగా నిలిచారు. ఆమె ప్రచారానికి కూడా జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఆమెకు 5,754 ఓట్లు రాగా.. నాలుగో స్థానంలో నిలిచింది.
2022 డిసెంబరులో బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేసింది శిరీష. జాబ్స్ రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారంటూ ఆమెపై పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా ఫైలయ్యింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఆమె ఫేమస్ అయ్యారు. బర్రెలక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో ఒకటిన్నర లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఫేస్‌బుక్‌లో మరో లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు.
బయట నుంచి చాలామంది వచ్చి కొల్లాపూర్‌లో బర్రెలక్కకు మద్దతు ఇచ్చారు కానీ.. స్థానికంగా మాత్రం ఓ మోస్తారు ఓట్లు మాత్రమే పడ్డాయి. తనకు వచ్చిన ప్రతి ఓటు విలువైనదేనన్నారు బర్రెలక్క. డబ్బు, మద్యం పంచకపోయినా ప్రజలు ఇష్టంతో, నిజాయతీతో ఓటు వేశారని చెప్పారు. కంచె ఐలయ్య, జేడీ లక్ష్మీనారాయణ లాంటివారు తనకు మద్దుతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తానని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..