Balineni Srinivasulu Reddy : ‘చంద్రబాబు ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయ్.. వాటిపై కూడా త్వరలోనే విచారణ’
Balineni srinivasulu reddy : టీడీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో ఎస్‌సీ భూముల విషయంలో అవినీతికి పాల్పడ్డ మాజీ.

Balineni srinivasulu reddy : టీడీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో ఎస్‌సీ భూముల విషయంలో అవినీతికి పాల్పడ్డ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఘనకార్యాలు ఇంకా ఉన్నాయని, త్వరలోనే వాటిపై కూడా చంద్రబాబు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని గతంలో చెప్పిన చంద్రబాబుకు ఇదే సామెత వర్తిస్తుందున్నారు. తప్పు చేస్తే అనుభవించక తప్పదని మంత్రి చెప్పుకొచ్చారు.
ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో 7.8 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని మంత్రి బాలినేని గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం 70 వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిందని, సీయం వైయస్ జగన్ చొరవతో డిస్కంలు ప్రస్తుతం లాభాల బాట పడుతున్నాయన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ఎట్టి పరిస్తితుల్లోనూ ప్రయివేటు పరం చేయమని ఉద్యోగులకు మంత్రి హామీ ఇచ్చారు.
ఇలాఉండగా, రాజధాని అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ మొన్న నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో బాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబు కూడా ఈ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా అమరావతి భూ కుంభకోణం కేసులో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును చేర్చడం విశేషం.
రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదుచేసింది. ఏపీ అధికారులు ఈ మేరకు మంగళవారం నోటీసులు అందజేశారు.
Read also : Vizag Steel Plant privatisation : భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నేపథ్యంలో వాటి తీరుతెన్నులు