AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు బాటలో అరవింద్.. ఎలాగంటే?

ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు మాటలు గుర్తున్నాయా? సరిగ్గా అదే స్టైల్ ఫాలో అవుతున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వినడానికి వింతగా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం యావత్ దేశప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తమ సమస్యను జాతీయ స్థాయిలో గుర్తించాలన్న ఉద్దేశంతో సుమారు 180 మంది రైతులు నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. దాంతో నిజామాబాద్ పోలింగ్‌ కోసం ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్‌ని […]

చంద్రబాబు బాటలో అరవింద్.. ఎలాగంటే?
Rajesh Sharma
|

Updated on: Dec 16, 2019 | 7:03 PM

Share

ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు మాటలు గుర్తున్నాయా? సరిగ్గా అదే స్టైల్ ఫాలో అవుతున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వినడానికి వింతగా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం యావత్ దేశప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తమ సమస్యను జాతీయ స్థాయిలో గుర్తించాలన్న ఉద్దేశంతో సుమారు 180 మంది రైతులు నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. దాంతో నిజామాబాద్ పోలింగ్‌ కోసం ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్‌ని వినియోగించాల్సి వచ్చింది. అయితేనేం.. ఎన్నికల్లో బిజెపి విజయఢంకా మోగించింది.

సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవితను ఓడించి మరీ లోక్‌సభ మెట్లెక్కిన బిజెపి ఎంపీ అరవింద్‌పై ఇపుడు ఒత్తిడి పెరుగుతోంది. నియోజకవర్గంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో అరవింద్ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రాంతీయ పార్టీకి ఓటేస్తే జాతీయ స్థాయిలో పనులు చక్కబెట్టలేరని, తాను గెలిస్తే.. మోదీని మెప్పించి మరీ పసుపు బోర్డును సాధిస్తానని చెప్పారు అరవింద్. కారణమేదైనా నిజామాబాద్ నుంచి విజయం సాధించారు. లోక‌సభకు చేరుకున్నారు.

ఇదంతా జరిగి ఆరు నెలలు పూర్తికావస్తోంది. అయినా.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కాలేదు. దీని కోసం ఎంపీతోపాటు స్థానిక నాయకులు, రైతులు ఎక్కని మెట్టు లేదంటే అతిశయోక్తి కాదు. అయినా కేంద్రం కనికరించలేదు.. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయలేదు. దాంతో ఎంపీ అరవింద్‌పై స్థానికంగా ఒత్తిడి పెరుగుతోంది. ‘‘బోర్డునైనా తెండి.. లేకపోతే రాజీనామా చేసి తమ వెంట ఉద్యమానికైనా రండి’’ అంటూ పసుపు రైతులు అరవింద్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.

ఈనేపథ్యంలోనే అరవింద్.. చంద్రబాబు అవలంభించిన వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు. 2014 నుంచి 2016 మధ్య ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్‌కు జీవాధారం అన్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అనడంతో వారితో మాటలు కలిపారు. మోదీ చెబుతున్నది నిజమే హోదానే జిందాతిలిస్మాత్ కాదని.. ప్యాకేజీతోను సూపర్ బంపర్ అభివృద్ధి సాధించుకోవచ్చని కొత్త పల్లవి మొదలుపెట్టారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్నికలు దగ్గరవడంతో మళ్ళీ హోదానే దిక్కు అనే పాత పల్లవిని తిరగదోడారు బాబు గారు.

ఇపుడు అరవింద్ వ్యవహార శైలి కూడా చంద్రబాబును తలపిస్తుందంటున్నారు నిజామాబాద్ ప్రజలు. ఒకప్పుడు ఈ ప్రాంత రైతులకు న్యాయం జరగాలంటే పసుపు బోర్డు ఏర్పాటు ఒక్కటే మార్గమన్న అరవింద్.. ఇపుడు అదొక్కటే అన్నింటికి పరిష్కారం కాదన్న వాదన షురూ చేశారు. బోర్డుకు బదులుగా ప్రత్యేక యంత్రాంగం సాధిస్తానని, జనవరిలోనే ఈ ప్రకటన వుంటుందని తాజాగా చెబుతున్నారు అరవింద్. ఆ ప్రకటన తర్వాత విత్తు దశ నుంచి మార్కెటింగ్ దాకా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయనంటున్నారు. మరి కొత్త పల్లవితో అరవింద్‌కు ఎలాంటి ఫలితం ఎదురవుతుందో వేచి చూడాలి.