ఎట్టకేలకు ఏపీసీసీ ప్రెసిడెంట్ నియామకం

దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ఏపీ కాంగ్రెస్ సారథి నియమితులయ్యారు. ఆ బాధ్యతలను మాజీ మంత్రి శైలజానాథ్‌కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. అనంతపురం జిల్లాకు చెందిన సాకె శైలజానాథ్.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంచి వాగ్ధాటి కలిగిన శైలజానాథ్ అప్పట్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన వారికి సారథ్యం వహించారు. గతంలో ఏపీసీసీ అధ్యక్షునిగా పని చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి 2019 సాధారణ […]

ఎట్టకేలకు ఏపీసీసీ ప్రెసిడెంట్ నియామకం
Follow us

|

Updated on: Jan 16, 2020 | 5:57 PM

దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ఏపీ కాంగ్రెస్ సారథి నియమితులయ్యారు. ఆ బాధ్యతలను మాజీ మంత్రి శైలజానాథ్‌కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. అనంతపురం జిల్లాకు చెందిన సాకె శైలజానాథ్.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంచి వాగ్ధాటి కలిగిన శైలజానాథ్ అప్పట్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన వారికి సారథ్యం వహించారు.

గతంలో ఏపీసీసీ అధ్యక్షునిగా పని చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి 2019 సాధారణ ఎన్నికల తర్వాత రాజీనామా చేశారు. ఆయన్ని బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం, అసలు క్రియాశీలక రాజకీయాలకే దూరంగా వుంటూ వస్తుండడంతో ఎట్టకేలకు ఏపీసీసీ అధ్యక్ష స్థానానికి శైలజానాథ్‌ను ఎంపిక చేశారు. గత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన వారు కాగా.. ప్రస్తుతం నియమితులైన శైలజానాథ్ కూడా అదే జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

శైలజానాథ్‌ను ఏపీసీసీ అధ్యక్షునిగా నియమించిన ఏఐసీసీ.. మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిది. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎన్. తులసి రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. గుంటూరుకు చెందిన షేక్ మస్తాన్ వలీని ఏపీసీసీ రెండో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. రెండు పదవులను రాయలసీమకిచ్చిన ఏఐసీసీ కోస్తాంధ్రకు మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌నివ్వడం విశేషం.

కాగా.. తనను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా నియమించిన రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు ధన్యవాదాలు తెలిపారు శైలజానాథ్. ప్రజల ఆలోచనలు, వారి కోరికలను ఏమాత్రం పట్టించుకోకుండా బీజేపీ దేశాన్ని పరిపాలిస్తోందని శైలజానాథ్ విమర్శించారు. సీనియర్ల అనుభవాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకెళ్తామని, ఏపీ రాజధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారాయన.