ఏలూరు కు ఇవాళ ముఖ్యమంత్రి జగన్.. వ్యాధి నిర్ధారణ కోసం పర్యటించనున్న మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ల బృందం
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకేంద్రం ఏలూరులో తీవ్ర అనారోగ్యం భారినపడి అస్వస్థతకు గురైన వారిని సీఎం జగన్ ఇవాళ పరామర్శించనున్నా...

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకేంద్రం ఏలూరులో తీవ్ర అనారోగ్యం భారినపడి అస్వస్థతకు గురైన వారిని సీఎం జగన్ ఇవాళ పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శిస్తారు. తర్వాత జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. మరోవైపు, ఏలూరులో ఇవాళ ప్రత్యేక వైద్య బృందాలు పర్యటించనున్నాయి. వ్యాధి నిర్ధారణ కోసం మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ల బృందం అక్కడ పర్యటించనుంది. రక్త నమూనాలు పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారించనున్నారు డాక్టర్లు. కాగా, వింత వ్యాధితో ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 286 మంది అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వారిలో 127 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మిగతావారు చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఓ వ్యక్తి మృతిచెందారు. విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూర్చతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారు.