గణితం ఇక చాలా ఈజీగా..! అనువాదిని ఏఐ, మ్యాథ్‌జోరో సంచలన భాగస్వామ్యం!
దేశంలోని 25 కోట్ల మంది పాఠశాల విద్యార్థుల మ్యాథ్స్ భయాన్ని పోగొట్టేందుకు 'అనువాదిని ఏఐ', 'మ్యాథ్‌జోరో' భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అనువాదిని ఏఐ సాంకేతికతతో, మ్యాథ్‌జోరో గేమిఫైడ్ పాఠాలను ఇకపై 22 భారతీయ భాషల్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు.

భారతదేశంలోని కోట్ల మంది విద్యార్థులకు గణితం అంటేనే ఒక రకమైన భయం. ఈ భయాన్ని పోగొట్టి, గణితాన్ని ఒక ఆటలా మార్చేందుకు విద్యా మంత్రిత్వ శాఖ(AICTE) ఆధ్వర్యంలోని ‘అనువాదిని ఏఐ’, ‘మ్యాథ్‌జోరో’ సంస్థలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. న్యూఢిల్లీలోని AICTE ప్రధాన కార్యాలయంలో అనువాదిని ఏఐ సీఈఓ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశాలు:
మాతృభాషలో బోధన: అనువాదిని ఏఐ అత్యాధునిక సాంకేతికతతో, మ్యాథ్‌జోరో యాప్‌లోని ప్రతి క్విజ్, గేమ్, పాఠం విద్యార్థికి నచ్చిన భాషలో(22 భారతీయ భాషలు) కనిపిస్తుంది. దీనివల్ల భాష అనేది విద్యార్థికి అడ్డుగోడగా మారకుండా, గణితాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు వారధిగా మారుతుంది.
గేమ్-బేస్డ్ లెర్నింగ్: మ్యాథ్‌జోరో వ్యవస్థాపకుడు రామదేవు రామ్‌కుమార్ ఆలోచన ప్రకారం.. గణితాన్ని కేవలం బట్టీ పట్టడం కాకుండా, ‘ఆల్జీబ్రా ఐలాండ్’, ‘ట్రిగనోమెట్రీ ఐలాండ్’ వంటి థీమ్ జోన్ల ద్వారా ఆటలా నేర్చుకోవచ్చు. ఇది 6 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
పోటీ పరీక్షలకు సిద్ధం: 6-10 తరగతుల్లో మ్యాథ్‌జోరో ద్వారా పునాది వేసుకున్న విద్యార్థులు, ఆ తర్వాత అనువాదిని ఏఐ వారి ‘అనువాదిని పరీక్ష’ వేదిక ద్వారా JEE, NEET వంటి పోటీ పరీక్షలకు తమ సొంత భాషలోనే సన్నద్ధం కావచ్చు.
ఆటోమేటెడ్ ప్రశ్నపత్రాలు: టీచర్లు కేవలం కొన్ని సెకన్లలోనే చాప్టర్ వారీగా, కావాల్సిన భాషలో ప్రశ్నపత్రాలను రూపొందించుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
ఈ భాగస్వామ్యం జాతీయ విద్యా విధానం (NEP 2020) లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. మాతృభాషలో విద్యను అందించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులందరికీ సమానమైన విద్యావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు.
