Tamil Nadu: తమిళనాడులో విద్యార్థినిపై లైంగిక దాడి యత్నం.. రాజకీయంగా రచ్చ రేపుతోన్న తాజా ఘటన..
మహిళలపై జరిగే లైంగిక దాడి ఘటనలు ఒక్కోసారి ప్రభుత్వాలను ఇరకాటంలో పడేస్తుంటాయి. తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఇలాంటి ఘటనతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అందరూ చూస్తుండగానే ఓ కామాంధుడు విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడం ఘటనలో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం పట్ల విపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన ఇప్పుడు రాజకీయంగా రచ్చ రేపుతోంది. నగరంలోని తామరై ప్రాంతాల్లో ఉన్న అన్నా యూనివర్సిటీలో ఓ యువతి మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలోని లేబరేటరీ సమీపంలో సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి విద్యార్థిని వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని స్నేహితుడిని తీవ్రంగా కొట్టడంతో భయపడి అక్కడి నుంచి అతను పారిపోయాడు. స్నేహితుడు అక్కడ నుంచి వెళ్లిపోయాక విద్యార్థినిపై అగంతకుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు.
అంతకుముందే బాధిత విద్యార్థిని కి సంబంధించిన రికార్డు చేసిన వీడియోను చూపించి నాకు సహకరించకపోతే వీడియోను వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా సహకరించాలని బలవంతం చేయడంతో విద్యార్థిని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా వెంటబడి విద్యార్థిని శరీరంపై తాకకూడని చోట్ల తాకుతూ దారుణంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై విచారణ చేపట్టిన పోలీసులు యూనివర్సిటీ సమీపంలో ఫుట్పాత్ పై బిరియాని విక్రయించే జ్ఞాన శేఖరన్ గా ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించారు.
కన్యాకుమారికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా కలకలం రేపుతోంది. రాజకీయ పార్టీలు ఘటనను తీవ్రంగా ఖండించాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే చీఫ్ ఎడపాడి పలని స్వామి స్టాలిన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. డిఎంకె ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని మహిళలపై దాడుల ఘటనలు పెరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి తప్ప పోలీసు వ్యవస్థ మహిళలకు రక్షణ కల్పించడంలో శ్రద్ధ వహించడం లేదని పలని స్వామి తప్పు పట్టారు.
తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలై కూడా ఘటనపై తీవ్రంగా స్పందించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత కల్పించలేని పరిస్థితి ఉంటే ఇక ప్రభుత్వం ఏం పని చేస్తున్నట్టు అని అన్నామలై ప్రశ్నించారు.
విపక్షాల ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి గోవి చెల్లయ్యన్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థినిపై దాడి ఘటనను విపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం ఎప్పుడు కఠినంగానే ఉంటుందని చెప్పారు. గతంలో అన్నాడీ అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొలాచి యువతి లైంగిక దాడి ఘటన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుందని తాజా ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారని విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి లోపాలు లేనప్పుడు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో విపక్షాలు రాజకీయం చేస్తుంటాయని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..