AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణాలో పాగాకు కమలనాథుల తాజా వ్యూహం ?

ఉత్తరాది రాష్ట్రాల తరువాత మెల్లగా దక్షిణాది రాష్ట్రాలపై కన్ను వేస్తోంది కాషాయ పార్టీ. తొలి విడత టార్గెట్ కర్ణాటకలో తన ప్రయోగం చేసి సక్సెస్ అయింది. అక్కడ కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి.. తన బీజేపీ సర్కార్ ను అధికార పీఠంపై కూచోబెట్టగలిగింది. ఇందుకు పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా వేసిన పాచిక పారింది. ఆ రెండు పార్టీల నేతల్లో అసంతృప్తులను ‘ చేరదీసి..తన పార్టీ రాజ్యసభ ఎంపీకి చెందిన ప్రయివేటు విమానంలో […]

తెలంగాణాలో పాగాకు కమలనాథుల తాజా వ్యూహం ?
Anil kumar poka
| Edited By: |

Updated on: Sep 21, 2019 | 1:23 PM

Share

ఉత్తరాది రాష్ట్రాల తరువాత మెల్లగా దక్షిణాది రాష్ట్రాలపై కన్ను వేస్తోంది కాషాయ పార్టీ. తొలి విడత టార్గెట్ కర్ణాటకలో తన ప్రయోగం చేసి సక్సెస్ అయింది. అక్కడ కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి.. తన బీజేపీ సర్కార్ ను అధికార పీఠంపై కూచోబెట్టగలిగింది. ఇందుకు పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా వేసిన పాచిక పారింది. ఆ రెండు పార్టీల నేతల్లో అసంతృప్తులను ‘ చేరదీసి..తన పార్టీ రాజ్యసభ ఎంపీకి చెందిన ప్రయివేటు విమానంలో ముంబైలోని ఓ హోటల్ కు తరలించి.. అక్కడ దాదాపు 15 రోజులపాటు హై డ్రామా నడిపించిన ఘనత ఆయనకే దక్కింది. మా ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవుల్లో మీకు బెర్త్ గ్యారంటీ అని హామీ ఇవ్వగానే ఆ ప్రయోగం విజయవంతమైంది. రాష్ట్ర అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోగా ఎడియురప్ప ఆధ్వర్యంలోని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంకీర్ణకూటమి పతనంలో తలో చెయ్యీ వేశారు. అలాగే రెబెల్స్ కూడా కుమారస్వామి సర్కార్ ని కూలగొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు. అన్నట్టుగానే ఎడియురప్ప సీఎం కాగానే.. తన క్యాబినెట్ లో రెబెల్స్ లో కొందరికి బెర్తులు ఇచ్చారు.

మరికొందరిని నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరిచారు. మొత్తానికి కమలనాథుల ప్లాన్ విజయవంతమైంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతానికి అక్కడ తమిళ తంబీలు ఎక్కువగా డీఎంకె, ఏఐడీఎంకె పార్టీలకు ప్రాధాన్యమిస్తున్నారు.కానీ- బీజేపీ అటు నుంచి నరుక్కురావడం ప్రారంభించింది. ఆ రాష్ట్రం నుంచి నిర్మలాసీతారామన్ కు ఏకంగా కేంద్ర మంత్రివర్గంలో మొదట తొలి ఎన్డీయే హయాంలో రక్షణ మంత్రిగా, ఆ తరువాత రెండో విడత హయాంలో మరో కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రిగా అతి ముఖ్యమైన పదవులనిచ్చి తమిళ తంబీల హృదయాల్లో కొంతవరకు కమలనాథులు స్థానం పొందగలిగారు. ఇది తమిళనాట కొంతవరకైనా తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇటీవలి వరకు తమిళనాడు బీజేపీచీఫ్ గా ఉన్న సౌందరరాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించడంలోని ఉద్దేశం ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది.తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ పరిస్థితి ‘ చాలావరకు మెరుగుపడడంతో తమ పార్టీకి చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ జూనియర్ మంత్రిగా నియమించడమే కాదు.. తమ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పంపారు మహారాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన సి.హెచ్. విద్యాసాగర రావును ఇక్కడ టీఆర్ఎస్ ని ఎదుర్కొనే దీటైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది. . ఇవన్నీ ఒక ఎత్తు కాగా-ఇక రాజ్ భవన్ లో గవర్నర్ సౌందరరాజన్ వహించబోయే పాత్ర మరో ఎత్తు కావచ్ఛునని తెలుస్తోంది.

తెలంగాణలో అధికార టీఆరెస్ లోని అసంతృప్తుల వివరాలు ఆమెకు చేరుతున్న సంకేతాలు కనబడుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే మంత్రి పదవులు పొందలేకపోయిన సుమారు పది, పదిహేను మంది టీఆరెస్ అసంతృప్తులు తెలంగాణ బీజేపీ నేతలతోనో, ఏకంగాఢిల్లీలో కమలనాథుల అధిష్టానంతోనో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ అరవింద్ తో టీఆరెస్ ఎమ్మెల్యే షకీల్ ఇంచుమించు రోజూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తాను ఆ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, అవసరమైతే సమయం వస్తే ఆ విషయాన్ని తానే మీడియా సమావేశంలో ప్రకటిస్తానని ఆయన చెబుతున్నారు. కానీ ఆయన చూపు కమలం పార్టీ వైపే ఉంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటులో టీఆర్ఎస్ నేతల వైఫల్యం పట్ల ఆ పార్టీ స్థానిక నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ ఈ విషయంలో ఇఛ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరకపోయినా ఆయన దీనిపై ఎప్పటికప్పుడు ఢిల్లీ పార్టీ హై కమాండ్ తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. మాజీ గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ అత్యంత సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. కానీ ప్రస్తుత గవర్నర్ సౌందరరాజన్ తో ఆయన తన మంత్రివర్గ విస్తరణ ఏర్పాటులో తప్ప మళ్ళీ మర్యాదపూర్వకంగానైనా ఆమెను మరోసారి కలిసిన సందర్భంలేదు. జరుగుతున్న పరిణామాలను గవర్నర్ స్థాయిలో ఆమె మౌనంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. 2023 లో తెలంగాణలో జరిగే ఎన్నికల నాటికి బీజేపీని మరింత పటిష్ఠపరచి…వీలయితే కాంగ్రెస్ లేదా టీపీసీసితో పొత్తుపెట్టుకునిగానీ, ఒంటరిగానో పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ధ్యేయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను అధిష్టానానికి తెలియజేస్తున్నట్టు కూడా సమాచారం.

ఇక ఏపీ విషయానికి వస్తే మొదట సీఎం జగన్ వందరోజుల పాలనపై ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఇంకా సమీక్షిస్తున్నారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజు వంటివారు ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. తమ నివేదికలను వారు ఢిల్లీకి పంపారు కూడా. అయితే కేసీఆర్ తో పోలిస్తే జగన్ బీజేపీ పట్ల విధేయంగానే ఉంటున్నారు. టీడీపీని తప్ప ఆయన కోటరీ బీజేపీని విమర్శిస్తున్న సందర్భాలు లేవు. అందువల్ల కమలనాథులు మొదట తెలంగాణపైనే ఫోకస్ పెట్టిన దాఖలాలు బలంగా కనబడుతున్నాయి. రానున్న రోజుల్లో అమిత్ షా లేదా . కమలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా గానీ తెలంగాణాలో మరిన్ని సార్లు పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి వ్యూహం ఏమిటో సులభంగా తెలిసిపోతోంది. త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కమలనాథులు ముఖ్యంగా తెలంగాణను టార్గెట్ చేయవచ్చు.