Creative Ideas In Shower: షవర్ కిందే క్రియేటివ్ ఐడియాలు ఎందుకొస్తాయి? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..
చాలామందికి స్నానం చేస్తుండగా.. షవర్ కింద నిల్చోగానే క్రియేటివ్ ఐడియాలు వస్తుంటాయి. షవర్ నుంచి వచ్చే..

చాలామందికి స్నానం చేస్తుండగా.. షవర్ కింద నిల్చోగానే క్రియేటివ్ ఐడియాలు వస్తుంటాయి. షవర్ నుంచి వచ్చే వెచ్చటి నీరు మీ శరీరానికి తగలగానే.. నూతన ఆలోచనలు పుట్టుకొస్తాయా.? ఇది అందరిలోనూ మెదులుతున్న చిక్కు ప్రశ్న. ఇలా ఎందుకు జరుగుతాయని తెలుసుకోవడానికి వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల పలు పరిశోధనలు చేపట్టారు. అందులోని భాగమైన కాగ్నిటివ్ సైన్స్ ఫిలాసఫీ పరిశోధకుడు జాక్ ఇర్వింగ్ పలు కీలక విషయాలు వెల్లడించాడు.
సృజనాత్మకతతో పాటు పూర్తిగా భిన్నమైన ఆలోచనలకు ఏకాగ్రత చాలా ముఖ్యమని, అయితే ఒక విషయంపై మెదడును అతిగా ఉపయోగించడం కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని జాక్ చెప్పారు. సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో వివిధ మార్గాలను ఎంచుకోవడంలో భాగంగా నిరంతరం శ్రమించే బదులుగా మెదడుకు విరామం చాలా అవసరం. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు.. అక్కడున్న వాతావరణం మీ మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే అప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆలోచించగలుగుతాడు. కాబట్టి పరిష్కారాలను త్వరగా కనుగొంటారు. అలాగే ఎప్పుడైతే మనిషి ఎలాంటి ఆటంకం లేకుండా ఆలోచిస్తాడో.. అప్పుడు సానుకూల ఫలితాలు, సృజనాత్మక ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటాయి.
మరోవైపు గతంలో చేసిన పలు పరిశోధనల్లో షవర్ ప్రభావం కారణంగా గొప్ప గొప్ప ఐడియాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేసవిలో తలపై చల్లటి నీరు, శీతాకాలంలో గోరువెచ్చని నీరు పడినప్పుడు మెదడు మంచి ఆలోచనలను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. అయితే, ఆ పరిశోధనకు కొంచెం భిన్నంగా ఇర్వింగ్ పరిశోధనా ఫలితాలు ఉన్నాయి. కాగా, మనం ఎప్పుడూ కూడా బోరింగ్ పనులు చేస్తున్నప్పుడు.. మెదడు సరిగ్గా పని చేయదు. ఏదైనా కొత్త పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు.. దాన్ని సరికొత్తగా చేయాలన్న తపనతో మనలోని సృజనాత్మకత బయటపడుతుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..