డాక్టర్ల మందుల చిట్టీపై Rx అని ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఇదే!
Rx Symbol Mean: డాక్టర్లు రాసే ప్రతి మెడికల్ ప్రిస్క్రిప్షన్‌పై Rx అనే గుర్తు కనిపిస్తుంది. మెడికల్ షాపుల బోర్డులు, మందు ప్యాకెట్లపై కూడా Rx అని రాసి ఉండటం తెలిసిందే. దీని వెనుక శతాబ్దాల చరిత్ర దాగి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఇప్పటికీ ఎందుకు ఈ గుర్తును ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి.

ఏదైనా అనారోగ్య సమస్యతో మనం డాక్టర్‌ను సంప్రదిస్తే.. వారు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ (మందుల చిట్టీ) పైన ఒక మూలన Rx అని రాసి ఉండటం అందరూ గమనించే ఉంటారు. అలాగే మెడికల్ షాపుల బోర్డులపై, మందుల ప్యాకెట్లపై కూడా ఈ గుర్తు కనిపిస్తుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై ఇప్పుడు Rx అని ప్రింట్ అయి ఉంటుంది. గతంలో డాక్టర్లు Rx అని రాసిన తర్వాత రోగి తీసుకోవాల్సిన మందులను రాసేవారు. Rx తర్వాత మందులు, మోతాదు, ఎన్ని రోజులు, ఎన్ని పూటలు తీసుకోవాలో రాసేవారు. అయితే ఈ ‘Rx’ అంటే ఏమిటి? ఇది ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏమిటి? తెలుసుకోండి.
Rx అంటే ఏమిటి?
Rx అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఉపయోగించే ఒక ప్రామాణిక వైద్య గుర్తు. సాధారణంగా ఈ మందులను తీసుకోండి లేదా ప్రిస్క్రిప్షన్ ప్రారంభం అనే అర్థంలో ఉపయోగిస్తారు. దీని మూలం గురించి విభిన్న కారణాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాటిలో రెండు ప్రధానంగా ప్రసిద్ధి చెందాయి.
Rx అనేది లాటిన్ భాషలోని “Recipere”
చరిత్రకారులు, వైద్య నిపుణులు ఎక్కువగా అంగీకరించే సిద్ధాంతం ప్రకారం..Rx అనేది లాటిన్ భాషలోని “Recipere” లేదా “Recipe” అనే పదానికి సంక్షిప్త రూపం. ‘Recipere’ అంటే తీసుకోండి లేదా స్వీకరించండి అనే అర్థం.
పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నట్టుగా కంపెనీలు తయారు చేసిన రెడీమేడ్ మందులు అందుబాటులో ఉండేవి కావు. వైద్యులే వివిధ మూలికలు, ఖనిజాలు, రసాయనాలను కలిపి ప్రత్యేకంగా మందులు తయారు చేయించేవారు. అందుకే కెమిస్టుకు లేదా ఔషధ తయారీదారునికి ఈ క్రింది పదార్థాలను తీసుకుని మందు తయారు చేయండి అనే సూచనగా ప్రిస్క్రిప్షన్ ప్రారంభంలో Rx గుర్తును రాసేవారు. కాలక్రమేణా అదే ప్రపంచవ్యాప్తంగా వైద్య ప్రిస్క్రిప్షన్‌లలో స్థిరపడిపోయిందని చెబుతారు.
జూపిటర్ దేవుడి చిహ్నం నుంచి వచ్చిందని మరో సిద్ధాంతం
మరో ప్రసిద్ధ సిద్ధాంతం ప్రకారం ‘Rx’ గుర్తు రోమన్ దేవుడైన జూపిటర్ (Jupiter) పురాతన చిహ్నం నుంచి రూపాంతరం చెందిందని మరో ప్రచారం కూడా ఉంది. అయితే ఈ సిద్ధాంతానికి చారిత్రక ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. అందువల్ల వైద్య చరిత్రలో Rx అంటే ‘Recipere’ అనే అర్థమన్న సిద్ధాంతానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
పురాతన కాలంలో వైద్యులు రోగి త్వరగా కోలుకోవాలని, మందు ప్రభావవంతంగా పనిచేయాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రిస్క్రిప్షన్ ప్రారంభంలో ఆ గుర్తును రాసేవారట. తర్వాత కాలంలో ఆ చిహ్నం సరళీకృతమై నేటి Rx రూపాన్ని సంతరించుకుందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. వైద్య శాస్త్రం ఎన్నో మార్పులు చూసినా, శతాబ్దాలుగా కొనసాగుతున్న Rx సంప్రదాయం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుండటం ఆసక్తికర అంశం.
Also Read: ఫ్యాన్ వేసుకుని యోగా చేస్తున్నారా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి!




