AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dumas Beach: చీకటి వేళ డ్యూమస్‌ బీచ్‌కు వెళ్లాలంటే వెయ్యి టన్నుల ధైర్యం ఉండాలి!

అదో సముద్ర తీరం.. ఉన్నది మన ఇండియాలోనే! పేరు డ్యూమస్‌ బీచ్‌. గుజరాత్‌లోని సూరత్‌కు జస్ట్‌ 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ బీచ్‌. అన్ని బీచుల్లా ఉండదిది! చూట్టానికి కాస్త భయం పుట్టిస్తుంది..

Dumas Beach: చీకటి వేళ డ్యూమస్‌ బీచ్‌కు వెళ్లాలంటే వెయ్యి టన్నుల ధైర్యం ఉండాలి!
Dumas Beach
Balu
| Edited By: Ravi Kiran|

Updated on: May 18, 2022 | 10:39 AM

Share

 Dumas Beach in Gujarat: అదో సముద్ర తీరం.. ఉన్నది మన ఇండియాలోనే! పేరు డ్యూమస్‌ బీచ్‌. గుజరాత్‌లోని సూరత్‌కు జస్ట్‌ 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ బీచ్‌. అన్ని బీచుల్లా ఉండదిది! చూట్టానికి కాస్త భయం పుట్టిస్తుంది.. ఇక్కడ ఆత్మలు సంచరిస్తాయని, రాత్రిళ్లు బీచ్‌లో సంచరించే వారికి హాని తలపెడతాయని చెప్పుకుంటుంటారు. నిజమెంతో తెలియదు కానీ సంధ్య చీకట్లు ముసరకమునుపే బీచ్‌ నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడికి రావడానికి జనం జంకుతారు. తెలియని వాళ్లు ఎవరైనా అటు వెళ్దామనుకున్నా స్థానికులు అడ్డుపడతారు. వెళితే ప్రమాదం అంటూ హెచ్చరిస్తారు. అసలేముందా బీచ్‌లో..?

ఆత్మలు తిరుగాడుతున్నాయో లేదో తెలియదు కానీ ఆ బీచ్‌ మాత్రం కాసింత భయానకంగానే ఉంటుంది. చిమ్మ చీకటిలాంటి నల్లటి సముద్రపు ఇసుక. వింతశబ్దాలు చేసే గాలులు. చెవిలో ఎవరో ఏదో చెబుతున్నట్టు అస్పష్టమైన మాటలు. దూరంగా వినిపించే వికృతపు నవ్వు. కుక్కల ఏడుపులు. చీకటిపడిన వేళ ఎవరైనా ఒంటరిగా అక్కడకు వెళితే మాత్రం భయంతో బిగదీసుకుపోవడం ఖాయం. వేలాది ఆత్మలు ఇక్కడ సంచరిస్తున్నాయన్నది స్థానికుల గట్టి నమ్మకం. ధైర్యం చేసి బీచ్‌కు వెళ్లిన వారికి ఆత్మల మాటలు లీలగా వినిపించాయని, తక్షణం అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాయని చెబుతారు. పక్కనే ఎవరో బిగ్గరగా నవ్విన చప్పుడు వినిపిస్తుందని, చూస్తే ఎవరూ ఉండరన్నది రాత్రిపూట అక్కడికి వెళ్లివచ్చిన కొందరి అనుభవాలు. పగటిపూటే నల్లగా భయపడుతున్నట్టుగా కనిపించే డ్యూమస్‌ బీచ్‌ రాత్రిపూట మరింత భయంకరంగా కనిపిస్తుంది. నిజానికి నాలుగు బీచ్‌ల సంగమమే డ్యూమస్‌ బీచ్‌. ఇందులో రెండు బీచ్‌లు టూరిస్టులకు తెలిసినవే! మూడో బీచ్‌లో జన సంచారం చాలా తక్కువగా ఉంటుంది.. ఇక నాలుగో బీచ్‌ అయితే నిర్మానుష్యంగా ఉంటుంది. నల్లటి సముద్రపు ఇసుక ఉండేది ఇక్కడే! ఒకప్పుడు ఇక్కడ హిందూ స్మశాన వాటిక ఉండేదట! కొన్ని వేల దహనసంస్కారాలు ఇక్కడ జరిగాయట! అలా ఏర్పడిన బూడిద సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారయ్యిందట!

Dumas Beach 1

ఈ బీచ్‌లోకి వచ్చే కుక్కలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయట! నాన్‌స్టాప్‌గా అరుస్తాయట! ఎదురుగా ఎవరో ఉన్నట్టుగానే మొరుగుతుంటాయట! కుక్కలను కంట్రోల్‌ చేయడానికి చెమటోడ్చాల్సి వస్తుందట! అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా డ్యూమస్‌ బీచ్‌పై ఎవరికి వారు కథలల్లేశారు. చెప్పిన మాటను వినకుండా బీచ్‌లోకి వెళ్లిన కొందరు ఇప్పటికీ తిరిగిరాలేదనే వదంతులను కూడా మనం వినవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లోని కొందరు ఇలాగే బీచ్‌కు వెళ్లి కనిపించకుండా పోయారట! బీచ్‌కు కూతవేటు దూరంలో ఓ పురాతన హవేలి ఉంది. నవాబు సిది ఇబ్రహీం ఖాన్‌ ఈ ప్యాలెస్‌ను కట్టించాడట! ప్రస్తుతం ఇందులో ఎవరూ నివసించడం లేదు! కాకపోతే దూరం నుంచి చూస్తే బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుంది. దగ్గరకు వెళితే మాత్రం ఆ ఆకారం అదృశ్యమవుతుందట!.. ఈ భయం కొద్దే హవేలీలోకి ఎవరూ వెళ్లడం లేదు. దయ్యాల్లేవు.. ఆత్మల్లేవు.. అంతా ఉత్తిదే అని అనేవాళ్లూ ఉన్నారు.. ఆత్మలు లేవని నిరూపించడానికే రాత్రంతా బీచ్‌లో బస చేసి వచ్చారు. ఆత్మలున్నాయని చెబుతున్నదాంట్లో నిజం లేదని చెబుతున్నారు. స్థానికులు చెబుతున్నట్టు డ్యూమస్‌ బీచ్‌ అంత భయానకంగా ఏమీ ఉండదని అంటున్నారు. ఏదో ప్రయోజనం కోసం కొందరు ఈ దుష్ర్పచారాన్ని మొదలు పెట్టారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.. ఉన్నాయో లేదో తెలియదు కానీ.. దయ్యాల బీచ్‌ అనేసరికి టూరిస్టులు పెరిగిపోయారు. ఇదీ దయ్యాల బీచ్‌ కథ.