AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషం శరీరంలోకి వెళ్లిందా..? ప్రతి నిమిషం కీలకమే

పాయిజనింగ్‌ కేసుల్లో ప్రతి నిమిషం అత్యంత కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషపదార్థం శరీరంలోకి వెళ్లిన వెంటనే లక్షణాలు కనిపించకపోయినా.. లోపల అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పాలు, ఉప్పునీరు, నిమ్మరసం ఇవ్వడం లేదా బలవంతంగా వాంతులు చేయించడం వంటి ఇంటి చిట్కాలతో కాలయాపన చేయకుండా

విషం శరీరంలోకి వెళ్లిందా..? ప్రతి నిమిషం కీలకమే
Poisoning
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 29, 2026 | 9:05 PM

Share

పాయిజనింగ్‌ జరిగినప్పుడు ప్రతి నిమిషం అత్యంత కీలకం. విషపదార్థం శరీరంలోకి వెళ్లిన వెంటనే లక్షణాలు కనిపించకపోయినా.. అది లోపల అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే పాలు, ఉప్పునీరు, నిమ్మరసం ఇవ్వడం లేదా బలవంతంగా వాంతులు చేయించడం వంటి చిట్కాలతో కాలయాపన చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత విషమించి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇంటి రసాయనాలు, పురుగుమందులు, మందుల అధిక మోతాదు, విషపూరిత వాయువులు లేదా పొగలు వంటి అనేక కారణాలతో పాయిజనింగ్‌ జరగవచ్చు. విషపదార్థం ప్రభావంతో వికారం, వాంతులు, అధిక లాలాజలం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గందరగోళం, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే కొన్ని విషపదార్థాల ప్రభావం ఆలస్యంగా బయటపడే అవకాశం ఉండటంతో.. లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా బాధితుడిని వెంటనే వైద్య చికిత్సకు తీసుకెళ్లడం అత్యంత అవసరం.

ముఖ్యంగా కరోసివ్‌ కెమికల్స్‌ తీసుకున్నప్పుడు బలవంతంగా వాంతులు చేయించడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వాంతుల సమయంలో ఆ రసాయనాలు మళ్లీ గొంతు, ఆహారనాళం, శ్వాసనాళాల్లోకి వెళ్లి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే విషపూరిత పొగలు లేదా వాయువులు పీల్చినప్పుడు బాధితుడిని వీలైనంత త్వరగా స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతానికి తరలించాలి. చర్మం లేదా కళ్లకు విషపదార్థం తగిలితే వెంటనే ప్రవహించే నీటితో బాగా కడగాలి.

బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు విషపదార్థం ఉన్న కంటైనర్‌, ప్యాకెట్‌, లేబుల్‌ లేదా దాని ఫొటోను వెంట తీసుకెళ్లడం వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏ విషపదార్థం తీసుకున్నారు? ఎంత మోతాదులో తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? అనే సమాచారం అందితే.. పరిస్థితిని వేగంగా అంచనా వేసి తగిన చికిత్స ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.

తీవ్రమైన పాయిజనింగ్‌ కేసుల్లో శ్వాసకోశ వైఫల్యం, కిడ్నీ దెబ్బతినడం, గుండె సంబంధిత సమస్యలు వంటి మల్టీ ఆర్గన్‌ కాంప్లికేషన్స్‌ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితుడికి నిరంతర వైద్య పర్యవేక్షణ, శ్వాసకు అవసరమైన సహాయం, రక్తపోటు నిర్వహణతో పాటు అవసరాన్ని బట్టి ప్రత్యేక చికిత్స, యాంటీడోట్లు అందించాల్సి ఉంటుంది.

పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోని క్లీనింగ్‌ కెమికల్స్‌, పురుగుమందులు, ఇతర రసాయనాలు, మందులను పిల్లలకు అందకుండా సురక్షితంగా భద్రపరచాలి. విషపదార్థాలను ఎప్పుడూ వాటి అసలు కంటైనర్లలోనే ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నీరు లేదా కూల్‌డ్రింక్‌ బాటిళ్లలోకి మార్చకూడదని హెచ్చరిస్తున్నారు.

పాయిజనింగ్‌ జరిగినప్పుడు ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా, లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా.. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడమే అత్యంత కీలకమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన సమయంలో సరైన చికిత్స అందితే తీవ్రమైన సమస్యలను నివారించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

Follow Us