Bhagavad Gita: మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం.. భగవద్గీత మనకు ఏం బోధిస్తోంది..?
ఈ గ్రంథంలో సర్వత్రా కనిపించే మొట్టమొదటి దిక్సూచి ధర్మబద్ధంగా ఉండమని చెప్పడం. ధర్మంగా వ్యవహరించు. ఎవరికీ కీడు తలపెట్టకు. ఎవరికి అన్యాయం చేయకు. నీతి నిజాయితీలతో వ్యవహరించు.

భగవద్గీత అతి పురాతన గ్రంథం. మహాభారత కాలం నాటిది. ఒక పవిత్ర గ్రంథంగా మానవ జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తోంది. నిజానికి, ఈ గ్రంథం భగవంతుడి ఉనికిని తెలియజేసే గ్రంథం గా కంటే మానవ జీవితాలను తీర్చిదిద్దే గ్రంథం గానే ఎక్కువగా చెరగని ముద్ర వేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఇందులోని ప్రతి వాక్యం మానవ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడానికి తోడ్పడేది. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేసినట్టుగా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయిన భగవద్గీత భక్తులు, జ్ఞానులు, యోగులు తదితరుల జీవితాలను ఒక విధంగా ప్రభావితం చేయగా, సామాన్యులు, పామరులు, ప్రాపంచిక ఆశలు, ఆశయాలు ఉన్న వారిని మరో విధంగా ప్రభావితం చేసింది. మొత్తం మీద ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసే గ్రంథమే ఇది. భగవంతుడిని కనుగొనడానికి తపస్సు చేయమనో, జపం చేయమనో, సర్వసంగ పరిత్యాగిగా మారాలనో ఈ గ్రంథం ఎక్కడా చెప్పలేదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి ఎలా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏది ధర్మమో, ఏది అధర్మమో మాత్రమే ఇది చెబుతుంది. ఇది సర్వకాల సర్వావస్థలకు వర్తించే గ్రంథం.
ఈ గ్రంథంలో సర్వత్రా కనిపించే మొట్టమొదటి దిక్సూచి ధర్మబద్ధంగా ఉండమని చెప్పడం. ధర్మంగా వ్యవహరించు. ఎవరికీ కీడు తలపెట్టకు. ఎవరికి అన్యాయం చేయకు. నీతి నిజాయితీలతో వ్యవహరించు. ధర్మాన్ని నువ్వు కాపాడితే నిన్ను ధర్మం కాపాడుతుంది. మహాభారతంలో యుద్ధానికి బయలు దేరే ముందు దుర్యోధనుడు ఆశీర్వాదం కోసం తన తల్లి గాంధారి దగ్గరకు వస్తాడు. తాను విజయం సాధించాలని ఆశీర్వదించమంటాడు. ” నాయనా, ధర్మంగా ఉండు. ధర్మమే గెలుస్తుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది”అని ఆమె చెబుతుంది. ధర్మరాజు ధర్మ దేవతకి పుట్టిన వ్యక్తి. మొట్టమొదటి నుంచి ధర్మాన్ని అంటిపెట్టుకున్న వ్యక్తి. ఆమెకు తెలుసు ధర్మరాజు పక్షమే విజయం సాధిస్తుందని. ఎక్కడైనా, ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. సత్యం న్యాయం మాత్రమే గెలుస్తాయి. అందువల్ల ఆధునిక యుగంలో ఎవరు ఎంత చదివినా, ఎంత సంపద కూడగట్టుకున్న ధర్మాన్ని అంటి పెట్టుకున్నంత వరకు విద్యా, సంపదలు, పేరు ప్రతిష్టలు రాణిస్తాయి. అధర్మంగా చేసే ఏ పని అధర్మానికి పాల్ప పాల్పడి ఏ వ్యక్తి రాణించడం జరగదు. మనిషి ఓ వ్యక్తిగా ఎదగాలంటే నైతికత చాలా ముఖ్యం. అధర్మం, అనైతికత మనిషిని పాతాళానికి తొక్కేస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి ఇది మొదటి మెట్టు.
నీ పని నువ్వు చిత్తశుద్ధిగా, నీతి నిజాయితీలతో పూర్తి చేయి. ఫలితం నాకు వదిలిపెట్టు అని శ్రీకృష్ణుడు బోధించాడు. నీకు అప్పగించిన పనిని నీ బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేయమని చెప్పడం వ్యక్తిత్వ వికాసానికి రెండవ ప్రధాన మెట్టు. మనకు అప్పగించిన పనిని అన్య మనస్తంగా బాధ్యతారహితంగా మొక్కుబడిగా చేసినప్పుడు అది పూర్తి ఫలితం ఇవ్వదు. మన మనసుకు తగ్గట్టుగానే మన పని కూడా ఉంటుంది. పూర్తి శ్రద్ధతో చేసినప్పుడు అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరో ముఖ్యమైన మెట్టు అహింసా విధానాన్ని అనుసరించు అనేది. ఎవరికీ హాని తల పెట్టకు అని చెప్పడం శ్రీకృష్ణుడు ఉద్దేశం. ఇతరులను చూసి అసూయ పడటం, ద్వేషించడం, తలపెట్టడం వంటి అవలక్షణాలను దూరంగా ఉంచాలని ఆయన చెబుతున్నాడు. ఇటువంటి లక్షణాలు తననే హరించి వేస్తాయి. సమాజంలో ఏమాత్రం ఎదగాలన్నా, ఓ గుర్తింపు తెచ్చుకోవాలన్నా ఈ లక్షణాలు తీవ్ర విఘాతం కలిగిస్తాయనిటంలో సందేహం లేదు. ఈ విధంగా ఆయన అర్జునుడికి బోధిస్తున్న పేరుతో సమస్త మానవాళికి మార్గ నిర్దేశం చేశారు. ఓ వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలంటే ఈ లక్షణాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.