Mother’s Day 2021: ‘అమ్మ’ సృష్టికే మూలం.. అమ్మ ముద్దుల వెనుకే కాదు.. దెబ్బల వెనుక కూడా అపారమైన ప్రేమ ఉంటుంది

Mother’s Day 2021: 'అమ్మ' త్యాగాలకు రూపం, ప్రతిరూపం.. సృష్టికి మూలం.. మమతానురాగాల ప్రతిరూపం.. తరగనిది తల్లి రుణం..ఎన్ని జన్మలెత్తినా అమ్మ ఋణం మనం తీర్చుకోలేం..

Mother’s Day 2021: ‘అమ్మ’ సృష్టికే మూలం.. అమ్మ ముద్దుల వెనుకే కాదు.. దెబ్బల వెనుక కూడా అపారమైన ప్రేమ ఉంటుంది
Mothers Day

Mother’s Day 2021: ‘అమ్మ’ త్యాగాలకు రూపం, ప్రతిరూపం.. సృష్టికి మూలం.. మమతానురాగాల ప్రతిరూపం.. తరగనిది తల్లి రుణం..ఎన్ని జన్మలెత్తినా అమ్మ ఋణం మనం తీర్చుకోలేం.. మన జీవితానికి మూలం.. ఇలా ఎన్ని చెప్పుకున్న అమ్మ గురించి తక్కువే. మహిళలకు మాతృత్వపు మాధుర్యాన్ని మించిన ఆనందం, ఆస్తి మరొకటి ఉండదు. ప్రతి స్ర్తీ తల్లి కావాలని పరితపిస్తుంది. పిల్లల ఎదుగుదలకు, సంరక్షణ కోసం ఎంతో శ్రమిస్తుంది. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకునే గొప్ప ఔదార్యం ఒక తల్లిలోనే ఉందంటే అతిశయోక్తికాదు.

అమ్మంటే..

► మాతృత్వం కూడా ఓ ఉద్యోగమైతే ప్రపంచంలో అత్యధిక జీతం అమ్మకే ఇవ్వాలి.
► అమ్మ ముద్దుల వెనుకే కాదు, దెబ్బల వెనుక అపారమైన ప్రేమ ఉంటుంది.
► దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం. సృష్టిలోని ప్రతీ జీవికి అమ్మ ఉంది.
► బిడ్డ నోరు విప్పకపోయినా, తల్లికి సమస్తం అర్థమైపోతుంది.
► నీకంటూ ఓ ఆస్తిత్వం లేనప్పుడు కూడా నిన్ను కోరుకుంటుంది. నువ్వెలా ఉంటావో తెలియకపోయినా ప్రేమించింది.
► నువ్వు కనిపించడానికి గంట ముందు నుంచి నీకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడింది.. అమ్మ మనసెంత గొప్పది.
► చిప్పుడు చలికి వణికిపోతుంటే వెచ్చని దుప్పటి కప్పి కాపాడింది. పెద్దయ్యాక సమస్యలతో సతమతం అవుతుంటే ప్రార్థనలతో కాపాడుతుంది అమ్మ.
►అమ్మకు ప్రపంచమే తెలియదనుకుంటాం,ఆమె ప్రపంచాన్ని వదిలివెళ్లాక కానీ అర్థం కాదు అమ్మ గొప్ప తత్వవేత్త అని.
►అమ్మ ఏ విషయమైనా రెండు సార్లు ఆలోచిస్తుంది. ఒకసారి తనవైపు నుంచి, ఒకసారి బిడ్డ వైపు నుంచి.
► అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు తీసుకురావడానికి అమ్మ పడే బాధను మర్చిపోయి పెంచుతుంది.
► తాను ఆకలితో ఉన్నా పిల్లలకు పెట్టందే అమ్మ ముద్ద ముట్టదు.
► దెబ్బ తగిలితే అమ్మను తెలియని వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చేమొదటి మాట ‘అమ్మా’

ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పది ఇంకోటి లేదు.. సృష్టిని సృష్టించిదే అమ్మ.. అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, కని పెంచి కంటికి రెప్పలా కాపాడి మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది అమ్మ. సమాజంలో జనులకు మనల్ని పరిచయం చేస్తుంది అమ్మ. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే. ఆదివారం ఈ రోజు ‘మదర్స్‌ డే’ సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి మాతృదినోత్సవం శుభాకాంక్షలు చెబుదాం.

అమ్మ అన్న దేవత లేకపోతే ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ ఉండరు. రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో ‘రోజు’ను ఇచ్చింది. అదే ‘మదర్స్ డే’ మాతృమూర్తి దినోత్సవం. దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారైంది. అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు. తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాల నుంచే వచ్చాయి. సంవత్సరంలో ఒక రోజుని ‘మదర్స్ డే’ గా గుర్తింపు సాధించడానికి అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి చేసిన పోరాటం వల్ల ఈ రోజు మదర్స్‌ డేను జరుపుకొంటున్నాము.

తప్పులను కూడా ఒప్పులుగా భరిస్తూ..

పేగు తెంచుకున్న పుట్టిన బిడ్డ తెలిసి, తెలియక చేసిన తప్పులను కూడా తన కడుపులోనే పెట్టుకుని క్షమించేస్తుంది తల్లి. మరోసారి ఆ తప్పులను చేయకుండా.. బిడ్డలను సరైన దారిలో నడిపిస్తోంది.