Population: పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్న 10 దేశాలివి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..
ప్రపంచవ్యాప్తంగా పురుషులు, మహిళల సంఖ్య దాదాపు సమంగా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో మహిళల జనాభా గణనీయంగా ఎక్కువ. ఈ పరిస్థితి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. పురుషులు ఉద్యోగాల కోసం వలస వెళ్లడం, మహిళలు ఎక్కువ కాలం జీవించడం, సామాజిక ఆరోగ్య సమస్యలు వంటివి ఈ లింగ వ్యత్యాసానికి దారితీస్తున్నాయి. ఈ ఆసక్తికర ధోరణి, దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ పాపులేషన్ రివ్యూ (2023) గణాంకాలు కొన్ని చోట్ల ఈ లింగ వ్యత్యాసం స్పష్టంగా చూపిస్తాయి. కొన్ని దేశాల్లో స్వల్ప తేడా ఉంటే, మరికొన్ని చోట్ల ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యత్యాసంగా ఉంది. మహిళల జనాభా ఎక్కువ ఉన్న పది దేశాలు, కారణాలు ఇలా ఉన్నాయి:
1. జిబౌటీ (నిష్పత్తి: ప్రతి పురుషునికి 1.2 మంది మహిళలు)
జిబౌటీలో దాదాపు 55% జనాభా మహిళలే. ప్రధాన కారణం చాలా మంది పురుషులు ఉపాధి కోసం విదేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. ఈ వలసల ప్రభావం గ్రామాలు, నగరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
2. హాంకాంగ్ (నిష్పత్తి: 1.16)
హాంకాంగ్‌లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. దీనికి రెండు ప్రధాన కారణాలు: మహిళా గృహ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం, మహిళల సగటు ఆయుర్దాయం ఎక్కువ. జనాభా వృద్ధాప్యం చెందుతున్న కొద్దీ ఇది మరింత స్పష్టమవుతుంది.
3. లిథువేనియా (నిష్పత్తి: 1.16)
లిథువేనియాలో చాలా ఏళ్లుగా పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. ముఖ్యంగా వృద్ధులైన వారిలో ఈ తేడా ఎక్కువ. పురుషులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ, ఆయుర్దాయం తక్కువ. ఇది దేశ జనాభా సంఖ్యలపై ప్రభావం చూపిస్తుంది.
4. బహామాస్ (నిష్పత్తి: 1.16)
బహామాస్‌లో మహిళల సంఖ్య కొద్దిగా ఎక్కువ. దేశం చిన్న జనాభా కలిగి ఉండటం, మహిళలు ఎక్కువ కాలం జీవించడం దీనికి ప్రధాన కారణం. చిన్నపాటి జనాభా మార్పులు కూడా ఇక్కడ పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తాయి.
5. రష్యా (నిష్పత్తి: 1.15)
లింగ అసమతుల్యత విషయంలో రష్యా ఒక ప్రముఖ ఉదాహరణ. చాలా వయసుల సమూహాల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, గత యుద్ధాల దీర్ఘకాలిక ప్రభావం వల్ల పురుషుల మరణాలు ఎక్కువ.
6. బెలారస్ (నిష్పత్తి: 1.15)
బెలారస్ కూడా రష్యా తరహాలోనే ఉంది. మహిళలు స్పష్టమైన మెజారిటీలో ఉంటారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, వృద్ధుల్లో. పురుషుల ఆయుర్దాయం తక్కువ, జనాభా వృద్ధాప్యం చెందడం ప్రధాన కారణాలు.
7. లాత్వియా (నిష్పత్తి: 1.15)
లాత్వియాలో కూడా చాలా వయసుల సమూహాల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. కారణాలు తెలిసినవే – పురుషులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ, ఆయుర్దాయం తక్కువ. మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు, కాలక్రమేణా ఈ వ్యత్యాసం పెరుగుతుంది.
8. ఆంగ్విల్లా (నిష్పత్తి: 1.14)
కరేబియన్‌లోని చిన్న బ్రిటిష్ భూభాగం ఆంగ్విల్లాలో మహిళల సంఖ్య ఎక్కువ. మొత్తం జనాభా తక్కువ కాబట్టి, వయసు పంపిణీలో చిన్నపాటి మార్పులు వలసలు లింగ నిష్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మహిళల ఎక్కువ ఆయుర్దాయం, సహజ జనాభా ధోరణులు ఈ అసమతుల్యతకు కారణం.
9. ప్యూర్టో రికో (నిష్పత్తి: 1.12)
ప్యూర్టో రికోలో లింగ వ్యత్యాసానికి ప్రధాన కారణం పురుషులు ఉద్యోగాల కోసం అమెరికా ప్రధాన భూభాగానికి వలస వెళ్తారు. మహిళలు, ముఖ్యంగా వృద్ధులు, అక్కడే ఉంటారు. కాలక్రమేణా జనాభా సమతుల్యత నెమ్మదిగా మారుతుంది.
10. మోల్డోవా (నిష్పత్తి: 1.12)
మోల్డోవా లింగ అసమతుల్యతకు ప్రధాన కారణం చాలా మంది పురుషులు పని కోసం విదేశాలకు, ముఖ్యంగా ఇతర యూరోపియన్ దేశాలకు వెళ్తారు. మరోవైపు, వృద్ధ మహిళలు నగరాలు, గ్రామాల్లోనే ఉంటారు. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా మహిళల సంఖ్య పెరగడానికి దారితీస్తుంది.




