Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
13 ఏళ్ల వయసులో పిల్లలు సాధారణంగా స్కూల్ ఆటపాటల్లో నిమగ్నమై ఉంటారు. కానీ, బీహార్‌కు చెందిన ఒక సామాన్య రైతు బిడ్డ మాత్రం అదే వయసులో దేశంలోనే అత్యంత కఠినమైన ఐఐటీ-జేఈఈ (IIT-JEE) పరీక్షను ఛేదించి చరిత్ర సృష్టించాడు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ఐఐటీయన్‌గా రికార్డు సృష్టించిన ఆ కుర్రాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసా?

బీహార్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థల వరకు.. సత్యం కుమార్ ప్రయాణం ఒక అద్భుతం. 12 ఏళ్లకే ఐఐటీ అర్హత సాధించి, 24 ఏళ్లకే పీహెచ్‌డీ (PhD) పూర్తి చేసిన ఈ భారతీయ మేధావి కథ ప్రతి విద్యార్థికి ఒక గొప్ప ప్రేరణ. యాపిల్ (Apple) వంటి సంస్థలో పనిచేసిన సత్యం కుమార్ ప్రస్తుత పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.
దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావించే ఐఐటీ-జేఈఈని ఛేదించడం ఎంతో మందికి కల. అటువంటిది కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆ లక్ష్యాన్ని ముద్దాడి, ‘యంగెస్ట్ ఐఐటీయన్’గా సత్యం కుమార్ దేశవ్యాప్త సంచలనం సృష్టించారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బఖోరాపూర్ అనే చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సత్యం, తన అసాధారణ ప్రతిభతో నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
అరుదైన రికార్డులు: సత్యం కుమార్ 2012లో కేవలం 12 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఐఐటీ-జేఈఈ రాసి 8,137 ర్యాంకు సాధించారు. అయితే, మరింత మెరుగైన ర్యాంకు కోసం మరుసటి ఏడాది (2013) మళ్ళీ పరీక్ష రాసి, 670వ ఆలిండియా ర్యాంకును సొంతం చేసుకున్నారు. తద్వారా 13 ఏళ్లకే ఐఐటీ కాన్పూర్‌లో అడుగుపెట్టి, అతి పిన్న వయస్కుడైన ఐఐటీయన్‌గా నిలిచారు. అప్పటివరకు సాహక్ కౌశిక్ (14 ఏళ్లు) పేరిట ఉన్న రికార్డును సత్యం చెరిపివేశారు.
విద్య కెరీర్: ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ మరియు ఎం.టెక్ డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన సత్యం, ఆపై ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్ యూనివర్శిటీ నుంచి కేవలం 24 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన టెక్ దిగ్గజం యాపిల్ (Apple), మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా అవకాశం కల్పించింది.
ప్రస్తుతం ఏం చేస్తున్నారు? తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సత్యం కుమార్ ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ సంస్థ టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ (Texas Instruments) లో ‘మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇంజనీర్’గా పనిచేస్తున్నారు. ఒక సామాన్య గ్రామం నుంచి ప్రపంచ స్థాయి టెక్ నిపుణుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
