MINIMOON: హనీమూన్ పాత మోడల్.. ఇప్పుడు నడుస్తోంది ‘మినిమూన్’ ట్రెండ్! కొత్త జంటలు దీనికే ఎందుకు ఓటేస్తున్నారో తెలుసా?
పెళ్లి అనగానే మనకు గుర్తొచ్చేది బంధుమిత్రుల సందడి, భోజనాలు, ఫోటో షూట్‌లు. వీటన్నింటి తర్వాత కొత్త జంట ఎంతో ఆశగా ఎదురుచూసేది హనీమూన్ కోసం. ఒకప్పుడు హనీమూన్ అంటే కనీసం వారం పది రోజుల పాటు విదేశాలకో లేదా సుదూర ప్రాంతాలకో వెళ్లడం ఆచారంగా ..

పెళ్లి అనగానే మనకు గుర్తొచ్చేది బంధుమిత్రుల సందడి, భోజనాలు, ఫోటో షూట్‌లు. వీటన్నింటి తర్వాత కొత్త జంట ఎంతో ఆశగా ఎదురుచూసేది హనీమూన్ కోసం. ఒకప్పుడు హనీమూన్ అంటే కనీసం వారం పది రోజుల పాటు విదేశాలకో లేదా సుదూర ప్రాంతాలకో వెళ్లడం ఆచారంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. నేటి తరం జంటలు సుదీర్ఘమైన హనీమూన్ కంటే ‘మినిమూన్’ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ మినిమూన్ అంటే ఏంటి? దీనికి ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది?
అసలు ఏంటి ఈ మినిమూన్?
మినిమూన్ అంటే పెళ్లి అయిన వెంటనే కేవలం రెండు లేదా మూడు రోజుల పాటు దగ్గర్లోని ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లడం. అంటే ఒక లాంగ్ వీకెండ్ ట్రిప్ లాంటిదన్నమాట. భారీ హనీమూన్ ప్లాన్‌ను భవిష్యత్తు కోసం వాయిదా వేసి, ప్రస్తుతానికి పెళ్లి అలసట నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చిన్న ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పాపులర్ ట్రెండ్‌గా మారుతోంది.
కొత్త జంటలు మినిమూన్ వైపు వెళ్లడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.మొదటిది సమయం, పెళ్లి పనుల కోసం ఇప్పటికే ఆఫీసుల నుంచి చాలా రోజులు సెలవులు తీసుకుంటారు. మళ్ళీ హనీమూన్ కోసం రెండు వారాల సెలవు దొరకడం కష్టమవుతోంది. అందుకే పెళ్లి తర్వాత దొరికిన రెండు రోజుల్లోనే ఒక చిన్న ట్రిప్ వేస్తున్నారు. రెండవది బడ్జెట్, పెళ్లి ఖర్చుల వల్ల ఆర్థికంగా కొంత భారం పడవచ్చు.
అలాంటి సమయంలో ఖరీదైన అంతర్జాతీయ హనీమూన్ కంటే తక్కువ ఖర్చుతో అయ్యే మినిమూన్ బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. మూడవది రిలాక్సేషన్, పెళ్లి హడావుడిలో కొత్త జంట విపరీతంగా అలసిపోతారు. ఆ సమయంలో సుదూర ప్రయాణాలు చేయడం కంటే దగ్గర్లోని రిసార్ట్‌లో ప్రశాంతంగా గడపడం వారికి నచ్చుతోంది.
మెగా మూన్..
మినిమూన్ వెళ్లేవారు హనీమూన్ క్యాన్సిల్ చేసుకుంటారని కాదు. పెళ్లి తర్వాత వెంటనే ఒక చిన్న ట్రిప్ వేసి, ఆ తర్వాత ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి తీరిక చూసుకుని పెద్ద హనీమూన్‌కు వెళ్తున్నారు. దీనిని ‘మెగా మూన్’ అని పిలుస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా ప్లాన్ చేసుకోవడానికి, సెలవులు సర్దుబాటు చేసుకోవడానికి వీలుంటుంది.
ముఖ్యంగా ఈ మినిమూన్ కోసం విలాసవంతమైన హోటళ్లు, స్టేకేషన్లు, ప్రైవేట్ విల్లాలను జంటలు ఇష్టపడుతున్నారు. మొత్తానికి హనీమూన్ అంటే కేవలం తిరగడం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడమే అసలు ఉద్దేశం. అది పది రోజుల ట్రిప్ అయినా లేదా రెండు రోజుల మినిమూన్ అయినా.. ఆ క్షణాలను ఎలా ఎంజాయ్ చేస్తున్నామన్నదే ముఖ్యం!
